ఆచార్యుడి అడుగుజాడల్లో పయనిద్దాం

ఆచార్యుడి అడుగుజాడల్లో పయనిద్దాం

* జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

#తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అడుగుజాడల్లో పయనిద్దామని నియోజకవర్గ ప్రజలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తన శ్వాసగా జయశంకర్ సార్ జీవించారని అన్నారు. ఉద్యమాన్ని శాసించిన మహనీయుడు దీర్ఘ విశ్రాంతిలోకి జారుకొని నేటికి 12 ఏండ్లయిందని అన్నారు. ఉద్యమ శ్రేణుల్లో ఆయన నింపిన స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిందని అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి కారణంగా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని చెప్పారు. ‘పుట్టుక నీది…చావు నీది…బతుకంతా తెలంగాణది’ అంటూ ఉద్యమకారులను చైతన్యపరిచారని అన్నారు. తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి మార్గదర్శనం చేశారని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ గా పనిచేసిన సమయంలో విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తి ని నింపారని అన్నారు.తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. దశాబ్దాల పాటు స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం కలలు కన్న ప్రొఫెసర్ జయశంకర్ 2011,జూన్21న మృతి చెందారని అన్నారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షల అమలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణబద్ధుడై పని చేస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం ఆచార్య జయశంకర్ ఏ మేరకు పరితపించారో..సీఎం కేసీఆర్ అదేవిధంగా కృషి చేస్తున్నారని అన్నారు. నీళ్లు…నిధులు…నియామకాల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిచేస్తూ వస్తున్నదని అన్నారు. స్వరాష్ట్రంలో దశాబ్దాల నీటి గోస తీరిందన్నారు. కాళేశ్వరం లాంటి ఆకట్టల నిర్మాణాల ద్వారా రాష్ట్రంలోని బీడు భూములన్ని సశ్యశ్యామలం అయ్యాయని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగిందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన, ఆరోగ్య,విద్యా రంగాలకు పెద్దపీట, దశాబ్దాల నాటి భూవివాదాలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను చేపట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ‘తెలంగాణ వచ్చేంత వరకు ఎత్తిన జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి’ అని విద్యార్థుల్లో, ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందజేస్తూ పురోగమిస్తున్నదని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking