అసౌకర్యం కల్గించొద్దు
అన్ని వసతులు కల్పించాలి
ఇంఛార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
తిప్పర్తి, అక్షిత న్యూస్ :
ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల ధరఖాస్తుల స్వీకరణ నమోదు సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం తిప్పర్తి మండలం గడ్డి కొండారం,వెంకటాద్రి పాలెం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమును ఇంఛార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి దరఖాస్తులు ఏ విధంగా పూరించి ఇస్తున్నారు,దరఖాస్తులు రిజిస్టర్ లలో ఏ విధంగా నమోదు చేస్తున్నారు పరిశీలించి సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తుకు తప్పని సరిగా రసీదు అంద చేయాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం 5 గ్యారంటీ కార్యక్రమం ద్వారా లబ్ది పొందటానికి దరఖాస్తులో అన్ని వివరాలు సరిగ్గా నింపాలని అన్నారు. అభయ హస్తం గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి పథకం,రైతు భరోసా పథకం,ఇందిరమ్మ ఇండ్ల పథకం,గృహ జ్యోతి పథకం,చేయూత పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం, రూ.లకు 500 లకు గ్యాస్ సిలిండర్ కు దరఖాస్తు చేసుకోవడానికి గ్యాస్ కనెక్షన్ నంబర్ ,సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ ల సంఖ్య రాసి ఎదురుగా టిక్ చేయాలని సూచించారు.రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూపాయలు 15000 ఆర్థిక సాయం కు రైతులు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వేనెంబర్ విస్తీర్ణం వ్యవసాయ కూలీలకు ఏటా 12000 రూ.లు, అందించేందుకు ఉపాధి హామీ కార్డు నెంబర్ వివరాలు దరఖాస్తులు పూరించాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికెట్ వివరాలు నమోదు చేయాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే సంబంధిత ఎఫ్. ఐ.అర్ నెంబర్,జైలుకు వెళ్లినచో జైలు పేరు,స్థలం,శిక్ష సంబంధిత వివరాలు నమోదు చేయాలని అన్నారు.గృహ జ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం నెలసరి విద్యుత్ వినియోగం యూనిట్ ల సంఖ్య, గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య వివరాలు నమోదు చేయాలని తెలిపారు. చేయూత పథకం కింద నెలకు 4 వేల రూ.లు పించన్ కు వృద్యాప, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకే దారు జీవనభృతి కోసం ఆయా బాక్సులలో ఎదురుగా టేక్ చేయాలని, దివ్యాంగులు 6 వేల రూ.లు పింఛన్ పొందేందుకు దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ నెంబర్ నమోదు చేయాలని,ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారైతే దరఖాస్తు చేయనవసరం లేదని తెలిపారు.
దరఖాస్తులను సమర్పించడానికి వచ్చే ప్రజలకు దరఖాస్తు నమోదులో అవగాహన కల్పించడంతో పాటు వారికి సహకారాన్ని అందించాలని సూచించారు. దరఖాస్తు కేంద్రాల వద్ద దివ్యాంగులు ,వృద్ధులు, మహిళల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని,షామియానా,త్రాగు నీరు ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.. ప్రజలకు దరఖాస్తులు అందు బాటు లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్.డి. ఓ రవి,పంచాయతీ రాజ్ ఈ ఈ భూమన్న, తదితరులు పాల్గొన్నారు.