మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులు సీజ్

మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులు సీజ్

*కాంగ్రెస్ తో కరువనడం మతిస్థిమితం లేని మాటలు

*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించకుండా, సకాలంలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన దేవాలయాలలో విగ్రహాల, ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజర య్యేందుకు వస్తున్న ఆయన మార్గమధ్యంలో మహర్షి రైస్ మిల్ వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆగి వారి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మిల్లర్లు సిండికేట్ అయి మద్దతు ధర ఇవ్వటం లేదని, సకాలంలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలపడంతో స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అధికారులను పంపి పరిస్థితిని సమీక్షించాలని కోరారు.

మహర్షి మిల్లును సీజ్ చేయాలంటూ ఆదేశించారు. గూడూరు సీతారామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తమది ప్రజా, రైతు ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తీవ్రస్వరంతో మిల్లర్లను హెచ్చరించారు. ఇప్పటికే అనేకసార్లు స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్, జిల్లా స్థాయి అధికారులు సమావేశం నిర్వహించి మిల్లర్లను హెచ్చరించిన తీరు మార్చుకోవటం లేదని, ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఇది పద్ధతి కాదని అన్నారు. బిఆర్ఎస్ నేతలు కరువును కాంగ్రెస్ తెచ్చిందనడం మతిస్థిమితం లేని మాటలు అన్నారు.

బిఆర్ఎస్ దిగి పోతు కరువు నిచ్చి పోయిందాన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు పడి పంట పండించిన రైతుకు మద్దతు ధర చెల్లించకపోతే సహించేది లేదన్నారు. మిలర్లలను ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆదుకుంటుందని, సన్నబియ్యంను ఇష్టారీతీగా ధరలు పెంచి అమ్ముకుంటున్నా చూసి చూడనట్లు వదిలేస్తున్నామన్నారు. మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా మిల్లర్లను హెచ్చరిస్తున్నానని,ఇప్పటికైనా మిల్లర్లు తమ తీరు మార్చుకోకపోతే మిల్లులను సీజ్ చేస్తామని, అవసరమైతే ప్రభుత్వమే మద్దతు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాసుల కక్కుర్తితో జగన్ దగ్గర మోకరిల్లి కృష్ణ, గోదావరి జలాలను ఆంద్రాకు తరలించి ప్రాజెక్టులు ఖాళీ చేసి దక్షిణ తెలంగాణను నాశనం చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనన్నారు. అందుకే ప్రజలు బిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. అయినా కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పంట నష్టంపై అధికారులతో అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర నాయకుడు ధీరావత్ స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, టీ.అర్జున్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాయం ఉపేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking