ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం

ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం

ఓటర్లకు అవగాహనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ (సిబిసి) ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

 ప్రలోభ రహితంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి

నల్గొండ,  అక్షిత ప్రతినిధి :

ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు.

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించే నిమిత్తం కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన (3) రోజుల ఛాయా చిత్ర ప్రదర్శన ( ఫొటో ఎగ్జిబిషన్ )ను ఆమె గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసామ్య మహోత్సవం వంటి ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన ప్రజాస్వామ్యం ఉందని, ప్రజాస్వామ్యం పరిడవిల్లెందుకు అందరికీ ఉపయుక్తమయ్యే ప్రజాస్వామ్యానికై ఓటు వేయవలసిన బాధ్యత ఉందని అన్నారు. ప్రత్యేకించి విద్యార్థులు పోలింగ్ రోజున సమయాన్ని వృధా చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. మంచి వ్యక్తిని నేతగా ఎన్నుకోవడం ద్వారా మంచి విద్య, వైద్యం వంటివి మంచి పాలసీలు రావడానికి అవకాశం ఉందని, అంతేకాక రాబోయే తరాలకు మంచి జరుగుతుందని, అందువల్ల అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి పాలసీలు కావాలో, ఎలాంటి వ్యక్తి కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని అన్నారు.

నల్గొండ జిల్లాలో ఓటర్లలో అవగాహన కోసం వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఇదివరకే జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, క్లాక్ టవర్, ఇతర ముఖ్యమైన కూడళ్ల వద్ద ఓటరు చైతన్యంపై మోడళ్లు, హోర్డింగ్ లు, ఫ్లెక్సీల వంటివి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటితోపాటు, నీడ, ఓ ఆర్ ఎస్ పాకెట్ల వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.
లోకసభ ఎన్నికలలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రలోభ రహితంగా ఎన్నికలు నిర్వహణకు సహకరించే బాధ్యత ఓటర్లదే నన్నారు. ఓటర్లు మొట్టమొదట తమ పోలింగ్ కేంద్రం ఎక్కడున్నది కచ్చితంగా తెలుసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు ఈసిఐ పోర్టల్ సహా మొబైల్ యాప్ వంటి పలు మార్గాలున్నాయని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎన్నికల సంఘం జారీచేసిన గుర్తింపు (ఎపిక్) కార్డు లేదా ఈసిఐ అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులలో దేనితోనైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లవచ్చునని చెప్పారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల ప్రభావం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం తగు ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. కాబట్టి వేసవి ఉష్ణోగ్రతల కారణంతో ఓటు వేయకుండా ఉండవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కాగా ఓటరు చైతన్యంలో భాగంగా సిబిసి ఈ ఫోటో ప్రదర్శన ప్రారంభించింది. ఇందులో 1951 నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్రను వీక్షకుల కళ్లకు కడుతుంది. అలాగే పోలింగ్‌ ప్రక్రియలో భాగమైన భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) మొబైల యాప్ లు నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకూ అన్ని అంశాలనూ ఈ ప్రదర్శనలో సమగ్రంగా వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు ఓటరు చైతన్యం పై స్వయంగా రచించి రూపొందించిన పాటను పాడి వినిపించారు .

ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొండలరావు, ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ్ కుమార్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్, బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking