ప్రపంచానికి దిక్సూచిగా భారత్
తెలంగాణలో పర్యటించిన యూరోపియన్ మీడియా
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఐటి, ఫార్మా, పర్యాటక, అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికి దిక్సూచిగా భారత దేశo నిలుస్తున్నదని సెంట్రల్ యూరోపియన్ దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఈ నెల 17 నుండి నేటి వరకు 4 రోజుల పాటు 12 సెంట్రల్ యూరోపియన్ దేశాల కు చెందిన 22 మంది మీడియా ప్రతినిధులు హైదరాబాద్ లోని పలు ప్రముఖ సంస్థలను సందర్శించింది.
వివిధ దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని అధ్యయనం చేసి పరస్పర అవగాహనతో ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని పెంపొందిం చుట కు, విద్య, వర్తక వాణిజ్య రంగాలలో సహకారానికి మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది. అందులో భాగంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియా , యూరోప్, ఆఫ్రికా , అమెరికా దేశాల మీడియా ప్రతినిధులు మనదేశంలో పర్యటించుటకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యటన షెడ్యూల్ రూపొందిస్తున్నది.

మీడియా ఎక్చేంజ్ లో భాగంగా ఆయా దేశాల మీడియా ప్రతినిధులు మార్చి 13 న న్యూఢిల్లీ వచ్చింది. న్యూ ఢిల్లీలో పలు సంస్థలను , విదేశీ వ్యవహారాల శాఖ ను సందర్శించింది. అనంతరం దేశంలో వేగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రతిబింబించే ఆయా సంస్థలతో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హన్మంతరావు చర్చించి షెడ్యుల్ రూపొందించారు. తదనుగుణగా రాష్ట్ర మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు , సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు యాసా వెంకటేశ్వర్లు
మీడియా బృందం పర్యటనను సమన్వయం చేశారు. వీరి వెంట న్యూ ఢిల్లీ నుండి విదేశీ వ్యవహారాల మంత్రత్వశాఖ అధికారి చంద్రేశ్ సింగ్ వచ్చారు.సెంట్రల్ యూరోప్ లోని ఆల్బెనియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, ఈస్తొనియ, ఫిన్లాండ్, లాట్వియా, లిథుయేనియా, పోలాండ్, రొమేనియా, సెర్బియా, స్లోవేకియా దేశాలలోని పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన 22 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా గోల్కొండ కోట , శిల్పారామం , భారత్ బయోటెక్, టి హబ్, టి వర్క్స్, స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ , ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, రామోజీ ఫిల్మ్ సిటీలను సందర్శిoచింది. ప్రపంచానికి చోదక శక్తిగా తెలంగాణలోని సంస్థలు ఎదుగుతున్నట్లు మీడియా ప్రతినిధులు అభిప్రాయపడింది.