అర్హులైన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు
అక్షిత ప్రతినిధి భూపాలపల్లి
జిల్లాలోని కొత్త పట్టాదారులైన రైతులు రైతుభరోసా పథకం లబ్ధి పొందడానికి జూలై 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు తెలిపారు. జూన్ 15, 2026 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈ విడతలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు.అర్హులైన రైతులు క్రింది పత్రాల జిరాక్స్ ప్రతులను తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారికి జులై 5 గడువులోగా అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. భర్తీ చేసిన రైతుభరోసా దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కొత్త పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ఇవ్వాలని తెలిపారు.జూలై 30 నుంచి నిధుల విడుదల దరఖాస్తుల పరిశీలన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం జూలై 30 నుంచి అర్హులైన రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. కావున జిల్లాలోని అర్హులైన కొత్త రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తులను నేరుగా మీ ప్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి కు మాత్రమే సమర్పించాలని, చివరి తేదీ జూలై 5 వరకు మాత్రమే ఉన్నట్లు ఆయన స్పష్టంచేశారు..