కొమ్మూరి ఆక్రమించిన భూములను ప్రభుత్వానికి అప్పగించాలి
–సిపిఎం,ఏఐపిబి నాయకుల డిమాండ్
చేర్యాల,జూన్ 26 అక్షిత ప్రతినిధి: కాంగ్రెస్ జనగామ డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూధాన్ సీలింగ్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరన్న లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని షాదీఖానాలో కొంగరి వెంకట్ మావో అధ్యక్షతన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఈ సమావేశంలో ఆముదాల మల్లారెడ్డి, అందే బీరన్న లు హాజరై మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల ప్రాంత రైతులకు చెందిన భూములు అమ్ముకోవద్దు భవిష్యత్తులో అత్యధికమైన ధర పలుకుతుందని హితవు పలుకుతూనే మన చేర్యాల ప్రాంతంలో వందల ఎకరాలు భూములను రైతులకు మాయమాటలు చెప్పి తన పేరున, తన కుటుంబ సభ్యుల పేరున పట్టాలను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేయించుకున్నారని అన్నారు. ఇందులో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ సీలింగు,భూదాను భూములను సైతం తన ఆధీనంలో ఉంచుకొని రైతులకు మాయమాటలు చెప్పి ఈ భూములను రెవెన్యూ అధికారులను సబ్ రిజిస్టర్ అధికారులను ప్రలోభ పెట్టి రికార్డులు మార్పించి పట్టా భూములుగా మార్చుకోవడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా ముస్త్యాల, రేబర్తి, లద్నూరు బంజారా గ్రామా శివారులోని భూములు ఆక్రమించిన వాటిలో ఉన్నాయని, చేర్యాల పట్టణంలో 984, 985, 987 సర్వే నంబర్లలో నిబంధనలను పక్కన పెట్టి వెంచర్ చేసి ప్రజల అవసరాలకు గుడి బడి ఆటస్థలాలకు మున్సిపాలిటీకి ఏమాత్రం భూమిని వదిలిపెట్టకుండా ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరిగిందన్నారు. ఈ సర్వే నంబర్లలో తన పెట్రోల్ పంపు పక్కన ఖాళీగా ఉన్న భూమిని వెంటనే చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించాలని, ఈ భూమిని ఇతరులకు అమ్మకుండా మున్సిపల్ అధికారులు నిలుపుదల చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణ శివారులోని బీడీ కాలిని, వావిళ్ళ వంపు సమీపంలో 1030 సర్వే నంబర్లు ఏడెకరాల ఒక గుంట భూదాన్ సీలింగ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేయించుకొని అనుభవిస్తున్న కొమ్మూరి కి పట్టాదారుగా అర్హత లేదని, ఈ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని లేనిపక్షంలో రెవెన్యూ అధికారులు ఈ భూముల రికార్డుల నుండి కొమ్మూరి ప్రతాపరెడ్డి పేరును తొలగించి వెంటనే ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చేర్యాల ప్రాంత సిపిఎం, ఏఐపిబి పార్టీలతోపాటు ఇతర పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని కొమ్మూరి ఆక్రమించిన భూములపై పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టౌన్ కార్యదర్శి పోలోజ్ కుమారస్వామి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి, బండ కింది అరుణ్ కుమార్, పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, సిపిఎం పట్టణ కమిటీ మండల కమిటీ సభ్యులు ఆముదాల నర్సిరెడ్డి, ముస్త్యాల ప్రభాకర్, పోలోజు శ్రీహరి, రాళ్ల బండి భాస్కర్, ఆముదాల రంజిత్ రెడ్డి, స్వర్గం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.