మోగిన దండోరా

మోగిన దండోరా

ఎమ్మార్పీఎస్
విజయోత్సవ ర్యాలీ

మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికిన నేతలు

భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ

కార్యకర్తల ఆట, పాట, కేరింతలు, ఉత్సాహంతో సాగిన ర్యాలీ

ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంద కృష్ణ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

దండోరా మోగింది. హైదరాబాద్ దద్దరిల్లింది. లక్షలాది మంది జనసందోహం, డప్పు వాయిద్యాలు, కేరింతల నడుమ మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం లభించింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు మొదటి సారి విచ్చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మంద కృష్ణ మాదిగకు ఎమ్మార్పీఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘనస్వాగతం పలికాయి.

మంగళవారం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్న ఆయనకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, ఎంజేఎఫ్
జాతీయ కో ఆర్డినేటర్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షులు దాస్ మాతంగి, మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ సుoచు అశోక్ మాదిగ, ఎంజేఎఫ్ జాతీయ కార్యదర్శి యాతాకుల అశోక్ మాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ మాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కలకొండ రామకృష్ణ సహా పలువురు నాయకులు స్వాగతం పలికారు.

అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్లవర్, ప్యాట్నీ సెంటర్, బైబిల్ హౌజు, ట్యాంక్బండ్ మీదుగా బషీర్బాగ్ చౌరస్తా వరకు తెలుపు జెండాలు చేతబూని, నల్ల కండువాలు మెడలో వేసుకుని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాన్ పై
నిలబడి మందకృష్ణ మాదిగ కార్యకర్తలకు అభివాదం చేశారు.

దండోరా డప్పులు.. గజమాలలు

మంద కృష్ణ మాదిగకు స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్, ఎంఎల్ఎఫ్, విహెచ్ఎ్పఎస్ తదితర సంఘాల నేతలు భారీగా తరలి వచ్చారు. వందలాది దండోరా డప్పులతో, బాణసంచా, పేపర్హీట్స్ పేల్చి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా క్లాక్వర్ వద్ద గల పాస్పోర్టు సెంటర్, ప్యాట్నీ సెంటర్లో మందకృష్ణమాదిగకు క్రేన్లతో భారీ గజమాలలు వేశారు. చిందు కళాకారులు, అభిమానులు తలపాగా, కిరీటం, గదలను బహూకరించారు. దారి పొడవునా గులాబీ పూలు చల్లారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఐదు గంటల పాటు  ర్యాలీ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బషీర్బాగ్ వరకు జరిగిన ర్యాలీలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆటపాటలు, కేరింతలు, ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైన ర్యాలీ దాదాపు ఐదు గంటలకు పైగా జరిగింది. ర్యాలీ మధ్యలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తదితరులతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎమ్మార్పీఎస్ కళా బృందం వారు మందకృష్ణ చేసిన ఉద్యమం, మాదిగ అమరవీరులను స్మరించుకుని పాటలు పాడారు.

పోలీసుల భారీ బందోబస్తు

ఎమ్మార్పీఎస్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా నార్త్ జోన్, సెంట్రలో జోన్ డీసీపీల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. దాదాపు 300మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. ట్రాఫిక్ ను మళ్లించడంతో వాహనదారులు స్వల్ప ఇబ్బందులు పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking