మువ్వన్నెల త్రివర్ణ పతాక
‘మిర్యాల’ లో వంద
అడుగుల జెండా రెపరెపలు
నేను నా మిర్యాలగూడతో వన్నె తెస్తా
అలరించిన వేలాది విద్యార్ధుల ప్రదర్శనలు
విద్యా, వైద్యానికి ప్రాధాన్యత
పండుగలా జెండా ఆవిష్కరణ
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మువ్వన్నెల జయ పతాక రెపరెపలాడింది. వంద అడుగుల ఎత్తుగల జాతీయ జెండాతో మిర్యాలగూడకు కొత్త శోభ చేకూర్చింది. సుమారు 15 వేల మంది విద్యార్థుల ప్రదర్శనలతో జాతీయ జెండా ఆవిష్కృతమైంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన వంద అడుగుల ఎత్తుగల జాతీయ జెండా పండుగ అంబరాన్నంటింది.

మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ స్టేడియంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మున్సిపల్ నిధుల నుంచి వంద అడుగుల ఎత్తుగల జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు చేపట్టిన పనులు పూర్తితో జెండా పండుగ కన్నుల విందుగా జరిగింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంద అడుగుల జాతీయ పతాకాన్ని ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి, జాతీయ పతాక రూపకల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహలతో కలిసి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య సేవలను మెరుగుపర్చి అభివృద్ధి పథంలో నడిపించి మిర్యాలగూడకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ప్రతినబూనారు.78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం స్థానిక ఎన్ఎస్పి క్యాంపు రాజీవ్ స్టేడియంలో అంగరంగ వైభవంగా వేలాది మంది విద్యార్థులు, ప్రజల సమక్షంలో జాతీయ జెండా పండుగ అంబరాన్నంటింది.ఆయా పాఠశాలల విద్యార్థులు అనేక సంస్కృతిక ప్రదర్శనలు సభికులను అలరించాయి. వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ రైతన్న విద్యా నేస్తం పథకాన్ని ప్రకటించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పిల్లలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం, రైస్ మిల్లర్స్ సహకారంతో నియోజవర్గ కేంద్రంలో గురుకుల విద్యా పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు బిఎల్ఆర్ ప్రకటించారు. అందులో 6 నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందిస్తామని, ఆ పాఠశాలను కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. 2026 నాటికి ఈ పాఠశాలను ప్రారంభిస్తామని చెప్పారు.

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నార్కెట్ పల్లి -అద్దంకి రహదారిపై మిర్యాలగూడ పట్టణ శివారులో 110 కోట్లతో 4 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులను మంజూరు చేయించినట్లు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే ఉద్దేశంతో 5 ఎత్తిపోతలను 49 కోట్లతో మంజూరు చేయించినట్లు చెప్పారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి పదిన్నర గంటలకు వ్యాపార సంస్థలను మూయించి వేస్తున్నామన్నారు. పేదవాళ్లకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు ప్రతిరోజు రెండుసార్లు ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను సందర్శించి మెరుగుపరుస్తానన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. యాదాద్రి ధర్మల్ ప్రాజెక్టు వల్ల ఉష్ణోగ్రత పెరగనున్నదని తగ్గించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆర్డీఓ జి శ్రీనివాసరావు, డిఎస్పి కె.రాజశేఖర్ రాజు, మున్సిపల్ కమిషనర్ ఎండి యూసుఫ్ ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.