లిఫ్ట్ లకై భూసేకరణ చేపట్టాలి
కలెక్టర్ నారాయణ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూములకై వెంటనే భూసేకరణ ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం అయన లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణపై నీటిపారుదల,రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫర్ న్స్ నిర్వహించారు.
జిల్లాలోని అన్ని డివిజన్ల పరిధిలో చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి అవసరమయ్యే భూముల పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని, ఎక్కడైనా ప్రభుత్వ భూములు, అసైన్ భూములు ఉన్నట్లయితే వెంటనే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే పట్టా భూములు ఉంటే సంబంధిత రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం అలాంటి భూములను సైతం సేకరిస్తామని, లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఎక్కడ భూములు అవసరమో వాటి వివరాలన్నింటిని తక్షణమే పంపించాలని ఆదేశించారు. మిర్యాలగూడ డివిజన్లో నెల్లికల్ స్టేజ్1 కు సంబంధించి 7.4 ఎకరాలకు వారంలోపు పి ఎన్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను సోమవారం నుండి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సంయుక్త తనికి బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల భూ సేకరణకు సోమవారం నుండి అన్ని మండలాలలో సంయుక్త తనిఖీలు ప్రారంభించాలని ఆయన అన్నారు. డిండి కింద దేవరకొండ డివిజన్ పరిధిలో అంబాభవాని, కంబాలపల్లి, పొదిల్ల లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన భూసేకరణపై ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు సరైన విధంగా ప్రణాళిక తయారు చేయాలని, ఏలాంటి సమస్యలు ఉన్న ఈ నెల చివరినాటికి అన్ని పరిష్కరించాలని, భూమి లేని కారణంగా ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగకూడదని అన్నారు .లిఫ్ట్ ఇరిగేషన్ల పూర్తిలో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్డీవోలు భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టుల భూ సేకరణ పనులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో భూసేకరణ పనులు చూసే విభాగం సైతం లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఆయా లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణ సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ తో వివరాలను తెలియజేశారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్డీవోలు, తదితరులు హాజరయ్యారు.