ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లొద్దు
అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపద్యంలో చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లతో నేడు రాష్ట్ర సచివాలయంనుండి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ డా. జితేందర్ లతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లా కలెక్టర్లకు తగు సూచనలను అందచేశారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల, రెవిన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే ఉపద్రవాన్ని ముందస్తుగా ఎదురుర్కొనేందుకు చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా కాపాడగలిగామని పేర్కొన్నారు. గోదావరీ, కృష్ణా నదులతో పాటు పలు వాగుల ద్వారా వచ్చే వరదను ఎప్పటి కప్పుడు అంచనా వేసి పకడ్బందీగా నీటిని వదలడం వల్ల పెద్దగా చెరువులు, కుంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని అన్నారు. . అయినప్పటికీ, రాష్ట్రంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి, మరింత వరద వస్తే తెగే ప్రమాదమున్నందున, అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత చర్యలను తీసుకోవాలని సూచించారు. ప్రాధానంగా మెహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, భద్రార్డీ కొత్తగూడెం , ఖమ్మం జిల్లాలో వరదలు, వర్షాల ప్రభావం అధికంగా ఉండి నీటిలో చిక్కుకున్న పలువురు గ్రామీణులను సురక్షితంగా కాపాడ గలిగామని చెప్పారు. అయినప్పటికీ, ఏడెనిమిది మంది మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవుల మంజూరు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను కోరారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జిల్లాల్లోని అన్ని చెరువులు, కుంటలు, కాలువలపై గట్టి నిఘా ఉంచి అవి తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రాథమిక సమాచారం అందిందని అన్నారు. వరద తీవ్రత అధికంగా ప్రాంతాలకు NDRF , SDRF బృందాలతోపాటు, కావాల్సిన సహాయ సహకారాలను హైదరాబాద్ నుండి అందిస్తున్నామని, ఇందుకు గాను రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశామని తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో జిల్లా కలెక్టర్లు చేపట్టిన ముందు జాగ్రత చర్యలు సఫలీ కృతమయ్యాయని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 45 పునరావాస కేంద్రాలను తెరచి, వాటిలోకి 2500 మందికి పైగా తరలించామని వెల్లడించారు. పాత భవనాలు, ఇళ్ల వద్ద నిఘా ఉంచాలని, అవి వర్షాలకు కూలే ప్రమాదం ఉన్నందున వాటిని కాళీ చేయించాలని తెలిపారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, తెలంగాణా స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో 26 ప్లాటూన్ ల రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. మహబూబాబాద్ లో నిలిచిపోయిన రైల్వే ప్రయాణికులకు తగు ఆహారాల పానీయాలను అందచేసి వారిని వారి గమ్య స్థానాలకు చేర్చడానికి చర్యలు చేపట్టామని తెలిపారు.