జలదిగ్బంధంలో
అయోధ్య విల్లాలు
93 అయోధ్య విల్లాల్లోకి నీరు
నిలిచిన విద్యుత్ సరఫరా
బాబ్బాకాన్ చెరువు కట్టు కాలువను మింగిన ప్రైమార్క్
సర్వే సరే…చర్యలేవి?
కొట్టుకుపోయిన కార్లు, ద్విచక్ర వాహనాలు
గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు..
కట్టుకాలువపై హైడ్రా అధికారులు దృష్టి సారించాలి
మేడ్చల్, అక్షిత బ్యూరో :
కబ్జాలకు అడ్డూ అదుపు లేదు. కాసులిస్తే కబ్జా చేసేయొచ్చు. పలుకుబడి.. అధికారం, కాసింత డబ్బు ఉంటే చెరువులు, కుంటలు, కట్టు కాలువలు కబ్జా చేసేయొచ్చు. కట్టడి చేయాల్సిన అధికారులు
కాసులకు కక్కుర్తి పడడంతో ప్రజలకు శాపంగా మారుతుంది. లక్షలాది, కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విల్లాలకు సమస్యలు నీటి గండo తప్పడం లేదు. ప్రైమార్క్ బాబ్బాఖాన్ చెర్వు కట్టు కాలువలను మింగడంతోనే దిగువన ఉన్న శ్రీరాం అయోధ్య విల్లాలు నీట మునిగే పరిస్థితి తలెత్తింది.

కార్లు,ద్విచక్ర వాహనాలు సైతం కొట్టుకొని పోయి విద్యుత్ సరఫరాకు అడ్డంకిగా పరిణమించింది. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అదే తరహాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి..దుండిగల్ పురపాలక పరిధి బహదూరపల్లిలోని అయోధ్య విల్లాలు నీట మునగడంతో సుమారు 93 విల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ బాబ్బాకాన్ చెరువు కట్టుకాలువను కబ్జాచేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో సమస్య ఉత్పన్నమయ్యింది. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ బాబ్బాకాన్ చెరువు కట్టుకాలువను ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో జూన్ 7, 2023 న కట్టుకాలువ కనుమరుగు అంటూ పత్రికలలో వార్తలు వెలువడడంతో తేరుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జూలై నెలలో ఉమ్మడి సర్వే నిర్వహించారు.

సర్వే నిర్వహించి సంవత్సర కాలం గడిచినా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావ్విస్తుంది. కట్టుకాలువ కబ్జాతోనే బాబ్బాకాన్ చెరువు అలుగు, తూము ప్రవాహం ప్రధాన రహదారిని ముంచెత్తుతుందని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*కబ్జాతో కట్టుకాలువ మాయం*
దుండిగల్ మున్సిపాలిటీ బహదూరపల్లిలో బిల్డర్ సంస్థ 182, 183, 184, 186, 188, 189, 191, 192, 193, 208, 210 సర్వే నంబర్లలో 2019 లో 5 ఎకరాల 1 గుంటలో ప్రైమార్క్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హెచ్ఎండీఏ అనుమతి పొందాడు. నిబంధనల ప్రకారం ఎటువంటి డివియేషన్ ఉండరాదు. కానీ బహదూరపల్లిలో నిర్మిస్తున్న ప్రైమార్క్ నిర్మాణదారుడు ఏకంగా పంటపొలాలకు పారే కట్టు కాలువను 9 గుంటలు చెరబట్టి దర్జాగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు తెరలేపాడు. దీంతో పంట పొలాలకు పారే కట్టుకాలువను పూడ్చి నిర్మాణాలు చేపడితే పంటపొలాలకు నీరు పారే అవకాశం ఉండదంటూ వాటిని అరికట్టాలంటూ అప్పట్లో ఇరిగేషన్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.

రైతుల ఫిర్యాదులు పట్టించుకోకపోగా కాసులకు కక్కుర్తి పడిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సదరు నిర్మాణ సంస్థకు సహకరించారని ఆరోపణలు వినిపించాయి. కట్టు కాలువ కబ్జాతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగు తున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
*కబ్జాతో నెమలిగుట్ట వరదకాలువ కనుమరుగు..*
బహదూరపల్లిలోని నెమలి గుట్ట నుండి బాబ్బాకాన్ చెరువుకు ప్రవహించే వరద కాలువను స్థానిక నాయకుని సహకారంతో ఓ నిర్మాణదారుడు పూడ్చి వేయడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద ప్రవాహం ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండంతో భారీగా ట్రాఫిక్ జామై వాహన దారులు నానా అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదు. నెమలి గుట్ట కబ్జాపై పలుమార్లు మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు చేసిన మాపై అధికారులు కేసులు నమోదు చేశారని స్థానిక కౌన్సిలర్ భరత్ కుమార్ అధికారుల తీరుపై మండిపడ్డాడు.

అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.ఉన్నతాధికారులు దృష్టి సారించి… అవసరమైతే హైడ్రా కొరడా జులిపించి కబ్జా కోరల్లో కనుమరుగైన కాలువలను పునరుద్ధరించాల్సిన అవసరమెంతైనా ఉంది.