ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవంతి
నేడు సీఎం రేవంత్ భూమి పూజ
మంత్రి దామోదరకు డాక్టర్ల సంఘం సత్కారం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
చిక్కి శల్యమైన ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవంతికి మార్గం సుగమమైంది. ఎంతో కాలపు ఎదురు చూపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉస్మానియా ఆస్పత్రికి అత్యాధునిక సదుపాయా లతో కొత్త భవంతిని నిర్మించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితర మంత్రులు భూమి పూజ చేపట్టనున్నారు. పెచ్చులూడిన ఆసుపత్రికి కొత్త భవంతిని నిర్మించాలంటూ ఏళ్ల తరబడి గత ప్రభుత్వం, నూతన ప్రభుత్వాల దృష్టికి తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర నేత డా. బొంగు (బరిగెల) రమేష్ సారధ్యంలో ఉస్మానియా విభాగము చేపట్టిన పోరు అంతా ఇంతా కాదు. ఉద్యమ కార్యాచరణగా ఏళ్ళ తరబడి సాగించిన పోరు ఎట్టకేలకు ఫలించింది.
పేదల ఆసుపత్రికి పెద్ద భవంతి నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర నేత డా.బొంగు (బరిగెల) రమేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహను కలసి శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. కొత్త భవంతి నిర్మాణం ఆవశ్యకతకై సాగించిన పోరుకు సంఘీభవంగా కలిసి వచ్చిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, తెలంగాణ ప్రభుత్వ వైద్యులు, అన్ని రాజకీయ పక్షాలు, నేతలకు డా.రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.