మన ఓటు, మన సీటుతోనే అధికారం
బీసీలు ఉద్యమించాలని బీపీ సూరజ్ మండల్ పిలుపు
బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటితేనే న్యాయమైన వాటా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
_69 శాతం రిజర్వేషన్లలో తమిళనాడు ఆదర్శం : ఎంపీ విల్సన్
2029లో బీసీనే సీఎం : తీన్మార్ మల్లన్న
బీసీ బంధు కింద రూ.20 లక్షలు ఇవ్వాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
వరంగల్,అక్షిత బ్యూరో:
బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అమలు చేసే వరకూ దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని బిహార్ మాజీ సీఎం బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీలు ఒక్క రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని సూచించారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం బీసీ రాజకీయ యుద్ధభేరి సభ జరిగింది. బీసీలకు 47 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 10శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయాలని సదస్సులో పాల్గొన్న వక్తలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా సూరజ్ మండల్ మాట్లాడుతూ ‘మన ఓటు-మన సీటు’ తోనే రాజ్యాధికారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులను కాలరాసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

డీఎంకే ఎంపీ విల్సన్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల అమలులో కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 1980 తర్వాత బీసీల రిజర్వేషన్లు పెరగలేదని గుర్తు చేశారు. బీసీలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయడంలో తమిళనాడు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏ గణన లేకుండా, రాజ్యాంగాన్ని సవరించకుండా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడాన్ని విల్సన్ తప్పుపట్టారు. బీసీల హక్కులను కాలరాయడానికి, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టడానికి కేంద్రం వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానం తీసుకురాబోతుందన్నారు.జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్ల అమలుకు వరంగల్ సభ దిక్సూచి కావాలని అన్నారు.ఇది వరంగల్ డిక్లరేషన్ గా చేసి కేంద్రం పై ఒత్తిడి పెంచేందుకు అందరం ప్రయత్నం చేద్దామన్నారు.

శాసన మండలి సభ్యుడు,మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ 1989 లోనే బీసీ లకు జరుగుతున్న అన్యాయం పట్ల ఇదే ఆర్ట్స్ కళాశాల మైదానం లో సోనియాగాంధీ నాయకత్వాన పెద్ద సభ నిర్వహించి రిజర్వేషన్లు పెంపుకు ప్రయత్నాలు సాగించామని రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్త కులగనన లో బాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల న్యాయమైన డిమాండ్ కుల గణన చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ కుల గణన చేపట్టిందని 50 శాతం పైగా రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సారథ్యం లో అసెంబ్లీ నీ సమావేష పరిచి రిజర్వేషన్లకు చట్ట బద్ధంగా కల్పించే చర్చను సైతం పెడుతుందని కాంగ్రెస్ సర్కార్ బీసీలకు సంపూర్ణ న్యాయం చేస్తుందని పీసీసీ,ఇతర నామినేటెడ్ రానున్న రోజుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నదని అన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఓసీలకు 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడంతో బీసీలకు ఉద్యోగాలు దక్కకుండా పోతున్నాయన్నారు. వచ్చే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో చివరి బీసీయేతర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అని, 2029లో బీసీనే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా బీసీలు గెలిస్తే అగ్రకులాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. కులం పేరుతో రాజకీయాలు చేస్తూ బీసీల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతీ బీసీ కుటుంబానికి బీసీ బంధు ద్వారా రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, బీసీ నేతలు వకులబరణం కృష్ణ మోహన్,సుందర్ లాల్ యాదవ్,సుదర్శన్ గౌడ్,కుమార్ గడ్గే,మండల పరశురాముడు,పాల్గొనగా కళాకారులు వరంగల్ సీను,మిట్టపెల్లి సురేందర్,ఎపురి సోనన్న,గంగా తదితరులు పాల్గొని ఎస్సి ఎస్టి లో మద్దతు బీసీ లకు ఎపుడు ఉంటుందని సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.