దిల్ సుఖ్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత..
– మరోసారి రోడ్డుపైకి వచ్చిన నిరుద్యోగులు
– నిరుద్యోగులు 20 వేల కానిస్టేబుల్ పోస్టుల కోసం డిమాండ్
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
నగరంలోని దిల్ సుఖ్ నగర్ లో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వందలాది మంది నిరుద్యోగులు, అభ్యర్థులు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి భారీ నిరసనకు దిగారు. డప్పు చప్పుళ్లతో, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దిల్ సుఖ్ నగర్ చౌరస్తా హోరెత్తిపోయింది.
5 వేలు మాత్రమేనా.. 20 వేల పోస్టులు కావాలి
తాజాగా, ప్రభుత్వం ప్రకటించిన కేవలం 5 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తమకు ఏమాత్రం సరిపోదని నిరుద్యగులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరిన్ని పోస్టులను కలిపి, కనీసం 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలతో మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తమకు 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ వేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే, నిరుద్యోగుల మెరుపు నిరసన, దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై నిరుద్యోగులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు నిరుద్యోగులపై దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో చైతన్యపురి పోలీస్ స్టేషన్కు తరలించారు.
