గిరిప్రదక్షిణ కాదు కొండగట్టు అభివృద్ధికి దిశ చూపండి
జనసేన కరీంనగర్ నాయకులు డా.బండారి రాజ్‌కుమార్
కరీంనగర్ అక్షిత బ్యూరో
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయడం కాదు ఆలయ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని జనసేన కరీంనగర్ జిల్లా నాయకులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు పుణ్య క్షేత్రాన్ని గురువారం ఆయన దర్శించుకున్నారు.ఆలయంలో ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని, కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం స్వాగతించదగిన విషయమేనని, అయితే లక్షలాది మంది భక్తులు ఆశించింది గిరిప్రదక్షిణ వార్తలు కాదని, కొండగట్టు అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం,పార్కింగ్, భక్తుల కాటేజీలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, రహదారులు, పరిశుభ్రత, భక్తుల వసతులు వంటి ప్రధాన సమస్యల పరిష్కారంపై స్పష్టమైన ప్రణాళికలు,కార్యాచరణను ప్రకటిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూశారన్నారు.కానీ ఆ అంశాలపై ప్రస్తావించకుండా, ఆలయ అభివృద్ధి కోసం చర్చ జరగకపోవడం కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అని సంబోధించడం రాజకీయ హుందాతనానికి తగినది కాదన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు డాక్టర్ సాయి కృష్ణ ప్రియ, జనసేన నాయకురాలు రజిత, చొప్పదండి జనసేన నాయకులు మొగిలిపాక రమేష్, శ్రీనాథ్‌తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు.