64 ఏళ్ల వ్యక్తిలో బైసైటోపీనియా.. బోన్‌మారో పరీక్షలతో అరుదైన వ్యాధి గుర్తింపు
– పదేపదే రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితిని నిర్లక్ష్యం చేయొద్దు
– వైద్యులు
ఖమ్మం/అక్షిత బ్యూరో:
తరచూ జ్వరం, తీవ్రమైన నీరసం, రక్తహీనతతో పాటు ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం, పదేపదే రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచించారు. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న ఖమ్మంకు చెందిన 64 ఏళ్ల వ్యక్తికి మలక్‌పేటలోని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో అనీమియా, థ్రాంబోసైటోపీనియాతో కూడిన బైసైటోపీనియా ఉన్నట్లు గుర్తించారు. నెల రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం తదితర సమస్యలతో బాధపడుతున్న సదరు వ్యక్తి ఆసుపత్రికి రాకముందే నెల రోజుల్లో ఏడు యూనిట్ల ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ (PRBC) ఎక్కించుకున్నట్లు వైద్యులు తెలిపారు. పెరిఫెరల్ బ్లడ్ స్మియర్‌లో ల్యూకోఎరిథ్రోబ్లాస్టిక్ బ్లడ్ పిక్చర్ కనిపించడంతో వ్యాధి కారణాన్ని నిర్ధారించేందుకు బోన్‌మారో ఆస్పిరేషన్, బోన్‌మారో బయాప్సీ నిర్వహించారు. పరీక్షల్లో ప్రైమరీ మైలోఫైబ్రోసిస్ (PMF) ఉండే అవకాశం ఉన్నట్లు సూచనలు కనిపించాయని వైద్యులు తెలిపారు. తదుపరి నిర్వహించిన NHP ప్యానెల్ నెగెటివ్‌గా వచ్చింది. చికిత్సలో భాగంగా మరో మూడు యూనిట్ల ల్యూకో డీప్లీటెడ్ PRBC అందించారు. చికిత్స సమయంలో ఆయాసం, జ్వరం, ఆక్సిజన్ సాచ్యురేషన్ (SpO₂) తగ్గడంతో రోగిని ఐసీయూకు తరలించి బ్రాడ్‌స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్‌తో పాటు అవసరమైన సపోర్టివ్ కేర్ అందించారు. స్టెరాయిడ్స్, ఇంజెక్టబుల్ ఎరిథ్రోపోయెటిన్ (EPO) తదితర చికిత్సలు ప్రారంభించడంతో రోగి పరిస్థితి క్రమంగా మెరుగుపడి హీమోడైనమికల్‌గా స్థిరపడినట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డా. ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. అనీమియా, ప్లేట్‌లెట్ల తగ్గుదలతో పాటు పదేపదే రక్తం అవసరమయ్యే రోగుల్లో మూల కారణాన్ని గుర్తించేందుకు సమగ్ర హీమటాలజీ పరీక్షలు, బోన్‌మారో పరీక్షలు కీలకమని తెలిపారు. సదరు రోగి బోన్‌మారో పరీక్షల్లో ప్రైమరీ మైలోఫైబ్రోసిస్ ఉండే అవకాశం కనిపించిందని, తదుపరి మూల్యాంకనం, నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. క్లిష్టమైన రక్త, బోన్‌మారో సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్స కోసం హీమటాలజీ, హీమటో-ఆంకాలజీ, క్రిటికల్ కేర్ తదితర విభాగాల సమన్వయంతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యశోదా ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.