“పెద్ది” ఇకలేరు

“పెద్ది” ఇకలేరు

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత

శోక సంద్రంలో నర్సంపేట

నర్సంపేట, అక్షిత ప్రతినిధి :

పెద్ది ఇకలేరు. తెలంగాణ ఉద్యమనేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు.బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 2026 జూలై 31 తెల్లవారు జామున (అర్ధరాత్రి 12:51 గంటలకు) సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. జూలై 26న హనుమకొండలోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురై, రోహిణి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) కారణంగా హార్ట్ స్టాప్ అయి, దీర్ఘకాలం సీపీఆర్ తర్వాత కోలుకున్నప్పటికీ, నాడీవ్యవస్థ స్పందన లేకపోవడంతో పరిస్థితి విషమమైంది.

బాల్యం – జీవితం

పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా (అప్పటి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి గ్రామంలో రాజి రెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన 1991లో వరంగల్‌లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం

యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డి, 2001లో కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్/బీఆర్ఎస్)లో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలు అందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన సభలు, మహాగర్జనల్లో చురుకుగా పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా పరిగణించబడ్డారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఘన విజయం సాధించి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018-2023 కాలంలో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మళ్లీ పోటీ చేసి దొంతి మాధవ రెడ్డి (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు.నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా కాలంలో సహాయక చర్యలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రజా సేవలో చురుకైన నాయకుడిగా, పార్టీ శ్రేణుల్లో, సాధారణ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రాంత ప్రజలు, తెలంగాణ రాజకీయ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. తెలంగాణ ఉద్యమం నుంచి అసెంబ్లీ వరకు ప్రజా సేవ చేసిన సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులకు, ఆప్తులకు ప్రగాఢ సానుభూతి. నర్సంపేట ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking