భారీ వర్షాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రామన్నపేట ఎస్సై జి. సతీష్ 

రామన్నపేట, అక్షిత ప్రతినిధి:

మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) జి. సతీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, నీటితో నిండిన రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని ఎస్సై సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు – 100, అగ్నిమాపక శాఖ – 101, అంబులెన్స్ – 108, విపత్తు నిర్వహణ – 1077 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, భారీ వర్షాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే రామన్నపేట పోలీసులను సంప్రదించాలని ఎస్సై జి. సతీష్ కోరారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించగలమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking