యోగ కిషన్ శిక్షకులకు ఘనంగా సత్కారం

యోగ కిషన్ శిక్షకులకు ఘనంగా సత్కారం

చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల పట్టణం యువ ఫిట్నెస్ అండ్ డ్యాన్స్ స్టూడియో లో సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి యోగా శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. 08-05-26 నుండి 14-06-2026 వరకు కొనసాగిన ఈ శిబిరంలో ప్రతిరోజూ దాదాపు 30 మంది విద్యార్థులు పాల్గొని వివిధ యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం మరియు ధ్యాన విధానాలను అభ్యసించారు.ఈ సందర్భంగా తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తోట సతీష్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది సంపూర్ణ జీవన విధానం. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు యోగాను అలవాటు చేసుకుంటే చదువులో ఏకాగ్రత పెరగడంతో పాటు మొబైల్, టీవీల వల్ల వచ్చే మానసిక అలసట కూడా తగ్గుతుందని, యోగా నేర్చుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఆదర్శంగా నిలుస్తారు” అని తెలిపారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు రఫత్ మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు యోగాను నేర్చుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ యోగ శిక్షణ అందించిన కిషన్ ని నిర్వాహకులు ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ కోశాధికారి, జాతీయ యోగాసనా జడ్జ్ యోగా శిక్షకురాలు తోట సంధ్య, యోగా అసోసియేషన్ సభ్యులు బస్వ రాజకుమార్ మరియు రమేష్ చేర్యాల స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధి సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking