భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, అక్షిత ప్రతినిధి :
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, రక్షణ చర్యల అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని వివరించారు. రాబోయే రెండ్రోజులపాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటీవలి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ఇతర నిర్మాణాల వివరాలను సమీక్షించారు. దెబ్బతిన్న నిర్మాణ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పశుకాపరులు, మత్స్యకారులు, ఇతర వ్యక్తులెవరూ వాగులు, చెరువులు, కుంటలు, ఇతర లోతట్టు ప్రాంతాల సమీపంలోకి వెళ్లకుండా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో వర్షపాతం, చెరువుల నీటిమట్టం వివరాలు ప్రజలకు తెలియజేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.వర్షాలు, వరదల ప్రభావంతో కాలానుగుణ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య శాఖ అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్ని మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు, డ్రై డే కార్యక్రమాలు, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయడం, దోమ లార్వాలను నాశనం చేసే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. అధికారులంతా సమన్వయంతో ఉంటూ ఎటువంటి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ రాజేందర్, డిపివో శ్రీనివాస్, సిపివో గంగారెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఇతర అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.