పేరుకే అది పెద్ద షాపింగ్ మాల్
అక్కడ వస్తువులన్నీ గడువు మీరినవే
అధికారులకు పిర్యాదు చేసినా చర్యలు శూన్యం
రిలయన్స్ షాపింగ్ మాల్ ను సీజ్ చేయాలని ప్రజల డిమాండ్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
అదొక జిల్లా కేంద్రం, అక్కడొక రిలయన్స్ సంస్థ పెద్ద షాపింగ్ మాల్, వినియోగదారులకు అక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే అక్కడ ఉన్న వస్తువులన్నీ గడువు మీరినవే ఉంటాయి. ఎంత చదువుకున్న వారైనా ఆ వస్తువులు కొనాల్సిందే, ఎవరైనా షాపింగ్ మాల్ యాజమాన్యం ను అడిగితే.. చాలా సింపుల్ గా “సారీ చూసుకోలేదు వేరేది తీసుకోండి” అంటారు. గడువు తీరిన వస్తువులను ప్రజలకు అంటగట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రిలయన్స్ సంస్థ ఆగడాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి డబ్బులు ఖర్చు పెట్టి మరీ రోగాలు కొనాల్సిన గత్యంతరం వినియోగదారులకు పట్టింది.పాల డబ్బాలు మొదలుకొని ప్రతి వస్తువు అక్కడ గడువు మీరినవే ఉంటాయి. ఎప్రిల్ మాసంలోనే మూడు ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఆ షాపింగ్ మాల్ యాజమాన్య వైఖరి మారడం లేదు.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలి
యాదాద్రి భువనగిరి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు రిలయన్స్ సంస్థ షాపింగ్ మాల్ పై ఆకస్మికంగా తనిఖీ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు. రిలయన్స్ సంస్థ షాపింగ్ మాల్ లో చాలా వరకు గడువు తీరిన వస్తువులను అమ్మడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వినియోగదారులు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లా ఆహార భద్రత అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

