“ఉత్తర” ప్రగల్భాలే ?

ఉత్తర” ప్రగల్భాలే ?

మూడేళ్లయిన ముందుకు కదల్లే!!

ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా తోపుచర్ల లిఫ్ట్

ఎన్నికల వాగ్దానాలను విస్మరించిన మంత్రి, ఎమ్మెల్యే                   

రైతులకు క్షమాపణ చెప్పాలి

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

కల్లబొల్లి కబుర్లు… ఉత్తర ప్రగల్భాలే తప్ప. మూడేళ్ల యిన అడుగు ముందుకు కదల్లే. ఉత్తర కుమారుడి ఉత్త మాటలు తప్ప కార్యరూపం దాల్చలేదు. అమలుకు సాధ్యం కానీ అనేక హామీలను, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో మూడేళ్లు గడిచిన మాడ్గులపల్లి మండలం తోపుచర్ల లిఫ్టు పనులు ముందుకు సాగడం లేదని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉమ్మడి తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి 14 ఎత్తిపోత ల పథకం రెండవ బావి వద్ద అసంపూర్తిగా ఉన్న తోపుచర్ల లిఫ్టు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, మాజీ వైస్ ఎంపిపి జెర్రిపోతుల రాములు గౌడ్ తో కలిసి అయన మాట్లాడుతూ గత మూడున్నర ఏళ్ల క్రితం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వరద కాలువ, డి- 40 కాలువల చివరి ఆయ కట్టు పరిధిలోని తోపుచర్ల, పుచ్చాకాయలగూడెం, గణపతివారిగూడెం,దేవతలబావి గూడెం,బొమ్మకల్లు, తదితర గ్రామాలలోని చెరువులు, కుంటలను నింపి కొత్తగా రెండు వేల ఎకరాల భూములను స్థిరీకరించేందుకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కోరిక మేరకు తోపుచర్ల లిఫ్టును మంజూరు చేస్తూ నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అబద్ధపు ప్రచారంతో ప్రజలను మోసగించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తోపుచర్ల లిఫ్టు పనులు చేపట్టడంలో పూర్తి నిర్లక్ష్యం వహించడంతో లిఫ్టు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉన్నాయన్నారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాటి నల్లగొండ ఎంపి నేటి నీటి పారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి ప్రస్తుత మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు తోపుచర్లతో పాటు జిల్లాలోని అన్ని లిఫ్టులను పూర్తి చేసి చెరువులను నింపి రైతులకు సాగునీరందిస్తామని ఉత్తర ప్రగల్బాలు పలికారన్నారు. ఏడాదిలోపు లిఫ్ట్ పనులు పూర్తి చేయలేని పక్షంలో రైతులు తమను చెట్టుకు కట్టివేయాలని ప్రకటించడం జరిగిందన్నారు.ఎన్నికలు జరిగి మూడేళ్లు గడిచిన ఇప్పటి వరకు తోపుచర్ల లిఫ్టు పనులను పూర్తి చేయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, లను ఎప్పుడు ఎక్కడ ఏ చెట్టుకు కట్టివేయాలో వారిద్దరూ నిర్ణయించుకోవాలన్నారు. అధికారం కోసం కల్ల బొల్లి మాటలు చెప్పిఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే నాయకులు రైతుల పై ఏమాత్రం ప్రేమ ఉన్న తక్షణమే తోపుచర్ల లిఫ్టు పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ఆందోళన చేపట్టి ప్రభుత్వం మెడలు వంచి లిఫ్ట్ పనులను ప్రారంభించి పూర్తి చేయిస్తామని హెచ్చరించారు. అదే విధంగా తోపుచర్ల ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో గున్ రెడ్డిగూడెం నుండి మంగాపురం వరకు బిటి రోడ్డు నిర్మాణానికి, రూ. 6 కోట్లు, తోపుచర్ల నుంచి మాడ్గులపల్లి రహదారి నిర్మాణానికి రూ. 3 కోట్లు పుచ్చకాయలగూడెం నుండి మండల కేంద్రానికి వెళ్లే రహదారి నిర్మాణానికి రూ. 1 కోటి నిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంజూరు చేసినట్టు స్థానిక నాయకులు పత్రికలలో ప్రకటించి రెండేళ్లు గడిచిన ఇప్పటివరకు రోడ్డు నిర్మాణ పనులకు అతిగతి లేకాపోగా నిధుల మంజూరు జడ లేదని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో చేపట్టిన పనులను మాత్రమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుచేస్తూ కాలయాపన చేయడం తప్ప మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క పైసా నిధులు తీసుకొచ్చిన పాపాన పోలేదని అయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీత్యాతండ, తోపుచర్ల,గ్రామ పంచాయతీ సర్పంచులు రాయరాపు ఉమారాణి- వెంకన్న, నన్నెబోయిన పార్వతమ్మ -రమేష్,బిఆర్ ఎస్ నాయకులు తంగేళ్ల సీతారాంరెడ్డి,గుర్రం వెంకట్ రెడ్ది, పోతురాజు యాదయ్య, మాడ్గుల చుక్కయ్య, నిమ్మల సీతారాంరెడ్డి, మంచికంటి అమృతరెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రషీద్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking