ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన
విశిష్ట సేవలందించిన ఆరోగ్య సిబ్బందికి అవార్డుల ప్రదానం
రంగారెడ్డి , అక్షిత బ్యూరో :
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం, శివరాంపల్లిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి హాజరుకాగా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ స్వర్ణ కుమారి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి మాట్లాడుతూ, జనాభాలో వచ్చే మార్పులు (డెమోగ్రాఫిక చేంజెస్ ), కుటుంబ సంక్షేమం, మహిళల ఆరోగ్యం, తల్లి-శిశు సంరక్షణ వంటి అంశాలపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. అనవసర గర్భధారణలను నివారించడం, ప్రసవాల మధ్య తగిన విరామం (స్పేసింగ్ మెథడ్స్ ) పాటించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబ ఆర్థిక, సామాజిక స్థితిగతులు కూడా బలోపేతం అవుతాయని వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలు, గర్భనిరోధక పద్ధతులు, ప్రసవానంతర కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికీ చేరుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఆరోగ్యవంతమైన కుటుంబమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల విజయవంతమైన అమలులో వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి గర్భిణిని నమోదు చేయడం, తల్లి-శిశు ఆరోగ్య సేవలు అందించడం, కుటుంబ నియంత్రణపై నిరంతర అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.కార్యక్రమం ముగింపులో కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలులో విశిష్ట సేవలు అందించిన వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి ప్రశంసా పత్రాలు, అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. వారి సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో ప్రజారోగ్య సేవలను అందించి జిల్లాకు ఆదర్శంగా నిలవాలని అభినందించారు. అవార్డులు అందుకున్న అధికారులు, సిబ్బంది ఈ గుర్తింపు తమలో మరింత బాధ్యత, ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాధికారులు డా. షీబా హయాత్, డా. రాధిక, డా. పాపారావు, డా. రాకేష్, డా. జ్యోతిబాయి, జిల్లా విస్తరణ, మాధ్యమ అధికారి (డెమో ) మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి కె. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవం సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, చిన్న కుటుంబం – సంతోషకరమైన కుటుంబం అనే భావనను ప్రతి ఇంటికీ చేరవేసి ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.