సమస్యలతో కునారిల్లుతున్న పాత కొత్తగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
వానొస్తే వల వల గాలొస్తే గల గల అన్న చందం
హాస్పిటల్ ఎదుట సిపిఎం ఆందోళన
కొత్తగూడెం అక్షిత న్యూస్
పాతకొత్తగూడెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అనేక సమస్యలను బృందం గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల వలయంలా ఉందని , అరకొర సదుపాయాలతో చాలీచాలని మందులతో ఉందని వారు అన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో గడ్డి , పిచ్చి మొక్కలు బాగా పెరిగి దోమలకు ఆవాసంలా తయారైందని , అనారోగ్యంతో వచ్చే రోగులు వారి అనారోగ్యం తగ్గకపోగా క్రొత్త వ్యాధులు వచ్చేలా ఈ హాస్పిటల్ ఉందని విమర్శించారు. హాస్పిటల్ ప్రహరీ గోడ కూలి గత రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దానిని నిర్మించకపోవడం కారణంగా ఆ హాస్పిటల్ జంతువులకు ఆవాసంగా తయారైందని అన్నారు. అలాగే కంటింజెట్ వర్కర్ లేక హాస్పిటల్ ఊడ్చే దిక్కు లేదని అన్నారు. కమ్యూనిటీ ఆఫీసర్ లేక డిప్యూటీషన్ పై వచ్చిన డాక్టర్ చూస్తున్నారని అన్నారు.ఇక్కడి డాక్టర్ నీ డిప్యూటేషన్ పై సఫాయి బస్తి వెళ్లారని దీనివలన ఇక్కడ పర్యవేక్షణ లేక పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో వైద్యం కరువైందని అన్నారు. సుమారు పదిహేనువేల జనాభా ఒకే హాస్పిటల్ ఉంది. దీనిని అభివృధి చేయడానికి ఎలాంటి నిధులను ప్రభుత్వం కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని వారు అన్నారు. హాస్పిటల్లో మందులను నిల్వ ఉంచడానికి స్టోర్ రూమ్ లేకపోవడం, అలాగే వర్షం వస్తే హాస్పిటల్లో ఉన్న గదులు అన్ని కురుస్తున్నాయని అన్నారు. దీని ద్వారా రోగులకు ఇచ్చే మందులు తడిసే ప్రమాదం ఉంది. ఇలా రోగుల ప్రాణాలతో ఈ ప్రభుత్వం ,అధికారులు చెలగాటం ఆడుతున్నారని తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు ఆలేటి శ్రీనివాస్, మంద నాగకృష్ణ, నాయకులు కొలిపాక వెంకటేశ్వర్లు, ఎస్ కే సాహేభి, ధనియాకుల శివ, కుక్కల ముత్తేష్, బాలకృష్ణ, రాములు, రఘు, సాయి భాస్కర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.