ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలి
తాగునీటి సమస్యలు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
రంగా రెడ్డి అక్షిత బ్యూరో :
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నుంచి సంబంధిత జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ పలు అభివృద్ధి, ప్రజారోగ్య అంశాలపై సమీక్షించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా కిట్లు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ సేవలు, అత్యవసర వైద్య సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వానాకాల వ్యవసాయ సీజన్ దృష్ట్యా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, రైతు నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె. కిరణ్మయి, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ అధికారులు, ఎంఈఓలు, ఏఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.