రక్షకులే.. భక్షకుల్లా ?
– గిరిజన చట్టానికి ఆర్డీఓ తూట్లు!
– భక్షకులకు ఆర్డీఓ అండ!!
– ఆర్డీఓ అహంకారం ఎల్టీఆర్ కేసులకు తాళం
– నడిస్తే నడుస్తయి లేకుంటే పెండింగ్
– మీకెందుకంటూ ఆర్డీఓ చిందులు
– ఎల్టీఆర్ కేసుల్లో ఆర్డీఓ నిర్లక్ష్యం
– డిస్పోస్ అయ్యాయంటూ ఏవో,జూనియర్ అసిస్టెంట్ సమాధానం..!
– తహసీల్దార్‌కు పంపామంటూ పొంతన లేని సమాధానాలు.!
– ఎన్నెండ్లైనా ఆగాలి మీకెందుకు ?
– విలేకరులపై కొత్తగూడెం ఆర్డీఓ అహంకారపూరిత వ్యాఖ్యలు
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత బ్యూరో :
చట్టాలను రక్షించాల్సిన అధికారి భక్షకులకు అండగా నిలిచాడు.గిరిజనేతరులకు అండగా నిలుస్తూ భూ హక్కులను కాలరాసే పరిస్థితి దాపురించింది. గిరిజన చట్టాలకు ఆర్డీఓ ఎసరు పెట్టాడు. గిరిజనుల భూ హక్కులకు రక్షణగా 1/70 చట్టం భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ లో నిర్వీర్యం చేస్తుండ్రు.గిరిజనుల భూహక్కులకు రక్షణగా నిలవాల్సిన ఏజెన్సీ చట్టాలను, ఉన్నతాధికారుల బాధ్యతలను విస్మరించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయo కించపరిచేలా వ్యవహరిస్తోంది. టేకులపల్లి మండలంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో గిరిజనుల భూములను అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలపై గత ఏడాది ఆరుగురు నాన్ ట్రైబల్స్‌పై నమోదైన కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, అధికారుల తీరు మాత్రం గిరిజనేతరులకు కొమ్ముకాసేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆఫీసు అంతా గందరగోళం.. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన సిబ్బంది!
ఆర్డీవో కార్యాలయంలో ఎల్టీఆర్ కేసుల ఫైళ్లు ఏమయ్యాయో కనీస అవగాహన కూడా అధికారులకు లేకపోవడం గమనార్హం. ఎల్టీఆర్ ఫిర్యాదారులు అక్షిత దినపత్రికకు ఇచ్చిన సమాచారంపై ‘అక్షిత’ బ్యూరో క్షేత్రస్థాయిలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లగా అధికారుల డొల్లతనం బయటపడింది. కేసుల గురించి తనకు తెలియదని చెప్పిన ఏవో లక్ష్మణ్, ఆ తర్వాత కేసులు ‘డిస్పోస్’ (పరిష్కారం) అయ్యాయని ప్రకటించారు. మరింత స్పష్టత కోసం జూనియర్ అసిస్టెంట్ నాగమణిని వివరణ కొరగా, రికార్డులు చూసి కేసులు డిస్పోస్ అయ్యాయని ఆమె కూడా ధృవీకరించారు. ఐతే ఈ విషయం బాధితులైన గిరిజనులకు తెలియకపోవడం గమనార్హం. కనీసం ఫిర్యాదుదారులకు సమాచారం లేకుండా ఎలా డిస్పోస్ చేస్తారని ఏవోను అడగగా, తనకంటే ముందున్న స్టాఫ్ హయాంలోనే డిస్పోస్ అయ్యాయని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
టేకులపల్లి తహసీల్దార్‌కు పంపామంటూ అబద్ధాలు
గతంలో ఈ సెక్షన్ చూసిన బాల్యానాయక్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఆ కేసులు టేకులపల్లి మండలానికి చెందినవి కాబట్టి తగిన చర్యల కోసం టేకులపల్లి తహసీల్దార్‌కు పంపామని చెప్పారు. టేకులపల్లి తహసీల్దార్ వీరభద్రంను చరవాణిలో సంప్రదించగా తమకు ఆర్డీవో కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు లేదా ఫైళ్లు రాలేదని తేల్చి చెప్పారు. చివరికి నిజాలు బయటపడటంతో సమాధానం చెప్పలేక “ఈ విషయం ఆర్డీవోని అడగండి” అంటూ ఏవో లక్ష్మణ్ చేతులెత్తేశారు.
మీకెందుకు చెప్పాలి? మూడేళ్లయినా పడుతుంది
కొత్తగూడెం ఆర్డీవో
ఈ వివాదంపై కొత్తగూడెం ఆర్డీవో మధును వివరణ కోరేందుకు వెళ్లిన విలేకరులకు ఆయన నుంచి ఎదురైన సమాధానం గిరిజన చట్టాలను, విలేకరులను అవమానించేలా ఉంది. చట్టబద్ధమైన బాధ్యతను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏమాత్రం లెక్కచేయనట్లు ఆయన మాట్లాడారు.ఎల్టీఆర్ కేసులు నడిస్తే నడుస్తాయి, లేకపోతే పెండింగులో ఉంటాయి. మీకెందుకు చెప్పాలి? ఏడాదిలోగా ఎల్‌టీఆర్ కేసులను పరిష్కరించాలని నిబంధన ఏం లేదు. అవి రెండేళ్లు పట్టొచ్చు, మూడేళ్లు పట్టొచ్చు, నాలుగేళ్లయినా పట్టొచ్చు. అయినా ఎల్టీఆర్ కేసుల వలన చాలామంది గిరిజనేతరులు ఇబ్బంది పడుతున్నారు పాపం.. ఇంతకంటే మీకు చెప్పేది ఏం లేదు. ఏవో లక్ష్మణ్ ఏం చెబితే అదే రాసుకోండి.” అంటూ విపరీత ధోరణిలో మాట్లాడారు. ఆర్డీవో స్థాయి అధికారి “పాపం గిరిజనేతరులు ఇబ్బంది పడుతున్నారు” అని బహిరంగంగా వ్యాఖ్యానించడం ఆయన ఎవరి వైపు వకాల్తా పుచ్చుకుంటున్నారో స్పష్టం చేస్తోంది. గిరిజనుల హక్కులను రక్షించాల్సిన కుర్చీలో కూర్చుని, చట్టాలను ఏమార్చేలా మాట్లాడటం పట్ల గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తెల్లమోహం వేసిన అధికారుల వెనుక ధనబలమా? రాజకీయ ఒత్తిడా?
ఆర్డీవో మాట్లాడిన తీరును తిరిగి ఏవో దృష్టికి తీసుకెళ్లగా, సమాధానం చెప్పలేక కంగారుపడుతూ “రెండు రోజుల తర్వాత రండి, వివరాలు చెప్తాను” అంటూ తెల్లముఖం వేశారు. ఏడాది కాలంగా నాన్చుతున్న కేసుల ఫైళ్లు హఠాత్తుగా మాయమవ్వడం, డిస్పోస్ అయ్యాయని అబద్ధాలు చెప్పడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.ఆర్డీవో వ్యాఖ్యానించినట్లు ఎల్‌టీఆర్ కేసుల పరిష్కారానికి కాలపరిమితి లేదనడం పచ్చి అబద్ధం. ఏజెన్సీ చట్టాల ప్రకారం భూ వివాదాలను నిర్ణీత గడువులోగా విచారించి గిరిజనులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ గిరిజనేతరులు తమ ఆస్తులను, భూములను కాపాడుకోవడానికి స్థానిక గిరిజన ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. గిరిజనుల రక్షణ కోసం తయారైన చట్టాలు ఒకవైపు ఉంటే.. ధనబలానికి తలొగ్గి అధికారులు నాన్ ,ట్రైబల్స్ ప్రయోజనాల కోసం పనిచేయడం ఎంతవరకు న్యాయం? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో జరుగుతున్న ఎల్టీఆర్ కేసుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి గిరిజనులకు న్యాయం చేయాలని బాధితులు, గిరిజన హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
