క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక సాంకేతికత
– రూ.40 కోట్లతో క్యాన్సర్ ప్రారంభ దశ గడ్డలను నిర్ధారించేందుకు మిషన్
– బయటి ఆహార పదార్థాలకు స్వస్తి పలికాలి
– ప్రతి మనిషి రోజులో 45 నిమిషాల వ్యాయామం తప్పనిసరి
– యశోద ఆసుపత్రి క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ సుమంత్ కుమార్ వెల్లడి
సూర్యాపేట , అక్షిత ప్రతినిధి :
క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం అనేక ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రోగికి ఒకే రకమైన చికిత్స విధానం సరిపోదని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ సుమంత్ కుమార్ మల్లుభట్టు తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి,క్యాన్సర్ రకం,వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స విధానాన్ని నిర్ణయిస్తామని పేర్కొన్నారు.క్యాన్సర్‌ను పూర్తిగా నియంత్రించడం లేదా తగ్గించడం,రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడం,చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలను సాధ్యమైనంత వరకు తగ్గించడం ఆధునిక క్యాన్సర్ చికిత్స ప్రధాన లక్ష్యాలని వివరించారు.ఆధునిక సాంకేతికతతో చికిత్సలో దుష్ప్రభావాలను తగ్గించడంతో పాటు చికిత్స ప్రభావాన్ని కొనసాగించవచ్చని అన్నారు.సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రూ. 40 కోట్లతో టెక్నాలజీ క్యాన్సర్ మిషన్ ని అందుబాటులో తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో అత్యాధునిక వికిరణ చికిత్స సాంకేతికతతో కూడిన ‘హైపర్‌సైట్’ యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు.ఈ విధానంలో క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించి అక్కడికే చికిత్స అందించడం ద్వారా చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వెల్లడించారు.చికిత్సను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించడం ఈ సాంకేతికత ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రతి నెల రెండవ,నాలుగవ బుధవారాల్లో సూర్యాపేటలోని కనెక్ట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో రోగులకు వైద్య సలహాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రజలు సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలను దూరంగా పెట్టి ఇంటి వంటకే ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే పండ్లు,కూరగాయలు సైతం వేడి నీటితో శుభ్రం చేసుకొని వాడుకోవాలని, దీంతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల మారిన పడకుండా ఉంటారని తెలియజేశారు.అనారోగ్య సమస్యలు ముఖ్యంగా క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులపై సంప్రదించాలని కోరారు.ఈ సమావేశంలో యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ మేనేజర్ కర్నే సుదర్శన్ రెడ్డి,మార్కెటింగ్ బృందం మేనేజర్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.