ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికుల మృతి

ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికుల మృతి

– మరో ఇద్దరి పరిస్థితి విషమం.. 12 మందికి గాయాలు

– విష రసాయనాల లీకేజీతో సమీప గ్రామాల్లో భయాందోళనలు

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో 

యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి: మండలంలోని దోతిగూడెం పరిధిలో ఉన్న హేజోలో ఫార్మా కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో 12 మంది కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. రియాక్టర్ పేలుడుతో కంపెనీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ప్రమాదం అనంతరం కంపెనీ నుంచి రసాయనాలు లీక్ కావడంతో ఘాటైన వాసనతో దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రసాయనాల వాసన, పొగ వ్యాపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రసాయనాలు లీక్ అవుతుండటంతో పొగ పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మూడు నెలల్లో రెండోసారి ప్రమాదం

ఇదే కంపెనీలో మూడు నెలల వ్యవధిలో రెండోసారి రియాక్టర్ పేలడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో కంపెనీలో భద్రతా ప్రమాణాలు, రియాక్టర్ల నిర్వహణ, కార్మికుల రక్షణ చర్యలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై, సమీప గ్రామాల ప్రజలకు అవసరమైన భద్రతా సూచనలు జారీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతులు–క్షతగాత్రుల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking