ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య విద్యా వ్యవస్థకే మాయని మచ్చ
హంతకులను కఠినంగా శిక్షించాలి..
రామన్నపేట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల డిమాండ్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
కొండమల్లేపల్లి నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య విద్యా వ్యవస్థకే మాయని మచ్చ అని రామన్నపేట మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రూపారెడ్డి హత్యను నిరసిస్తూ శుక్రవారం రామన్నపేట మండల వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బంద్ నిర్వహించారు. పలు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుంచి సుభాష్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సుభాష్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కరెస్పాండెంట్లు మాట్లాడుతూ.. నేటి విద్యా వ్యవస్థలో కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రవర్తన తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. సమాజ నిర్మాణంలో గురుతర బాధ్యత నిర్వహించే ఉపాధ్యాయులు, విద్యా సంస్థల నిర్వాహకులకు రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులకు అడ్డుకట్ట వేయకపోతే విద్యా వ్యవస్థ మనుగడకే పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు టి. మల్లికార్జున్, జె. మార్టిన్, జి. నరేందర్‌రెడ్డి, కనకాచారి, నాగరాజు, శ్రీధర్ తదితరులతో పాటు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.