భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, అక్షిత ప్రతినిధి :
భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.గురువారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న భూముల సర్వేపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వే ను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. సంబంధిత అధికారులంతా క్షేత్ర స్థాయిలో సర్వేలో పాల్గొనడంతో పాటు, ఉన్నతాధికారులు సర్వే తీరును పర్యవేక్షించాలన్నారు. అధునాతన పరికరాల ద్వారా సర్వే నిర్వహణ సులభంగా, ఖచ్చితత్వంతో ఉంటుందని అన్నారు. ప్రణాళిక ప్రకారం సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.సర్వే నిర్వహణకు సంబంధించి నూతన ల్యాప్ టాప్ లను అధికారులకు కలెక్టర్ అందజేశారు. అంతకముందు కలెక్టర్ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు రాంగోపాల్ తో కలిసి ఆర్థిక అక్షరాస్యత అవగాహన, సహాయం, ఆర్థిక అక్షరాస్యత కేంద్రానికి సంబంధించిన గోడ ప్రతులను డీఈవో భోజన్న, డిపిఆర్వో విష్ణువర్ధన్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ దేవీదాస్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్ నరసింహమూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.