కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ రద్దు చేస్తే ఊరుకోం

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ రద్దు చేస్తే ఊరుకోం…

పెండింగ్‌ లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలి

తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నిరసన…

లోకేశ్వరం, ఆగస్టు 20 (అక్షిత న్యూస్‌):

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను రద్దు చేసే ఆలోచనను కాంగ్రెస్‌ ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్‌ఎస్‌ ముధోల్‌ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ జెడ్పీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌ డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ పిలుపు మేరకు గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలో ముందుగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్‌ఐ లలితకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా లోలం శ్యాంసుందర్‌ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాలను నిలిపివేయడం సరికాదన్నారు. చట్టపరమైన అవకాశాలను పరిశీలించి అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పేదల సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కరిపే శ్యాంసుందర్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ చిన్నారావు, సర్పంచ్‌ వెంకటేష్‌, మాజీ సర్పంచ్‌ దిగంబర్‌, ఉప సర్పంచ్‌ కడారి రాజు, సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ బండి ప్రశాంత్‌, నాయకులు అనిల్‌, పాల గంగాధర్‌, ప్రభాకర్‌రావు, సంజీవ్‌, చిన్నబోజారెడ్డి, సందీప్‌, ప్రకాష్‌, రాజన్న, రాజు, ప్రవీణ్‌, భోజన్న తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking