చిల్కానగర్ గ్రేవ్‌యార్డుల్లో సీవరేజ్ పైప్‌లైన్ పునరుద్ధరించాలి

*చిల్కానగర్ గ్రేవ్‌యార్డుల్లో

సీవరేజ్ పైప్‌లైన్ పునరుద్ధరించాలి

మాజీ కార్పొరేటర్

బన్నాల గీత ప్రవీణ్*

ఉప్పల్, అక్షిత ప్రతినిధి :

చిల్కానగర్ డివిజన్‌లోని హిందూ, ముస్లిం గ్రేవ్‌యార్డుల్లో దెబ్బతిన్న సీవరేజ్ పైప్‌లైన్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని మాజీ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు శనివారం ఉప్పల్ బాగాయత్‌లోని వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. చిల్కానగర్‌లోని హిందూ, ముస్లిం గ్రేవ్‌యార్డుల్లో సీవరేజ్ పైప్‌లైన్ దెబ్బతినడంతో మురుగు నీరు ఓవర్‌ఫ్లో అవుతోందని, దీంతో స్మశానవాటికల ప్రాంగణమంతా బురదమయంగా మారిందని గీత ప్రవీణ్ తెలిపారు. తీవ్ర దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విషజ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న పైప్‌లైన్‌ను వెంటనే మరమ్మతులు చేసి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్ వెంటనే జీఎం సంతోష్‌కు ఫోన్ చేసి హిందూ, ముస్లిం గ్రేవ్‌యార్డులను సందర్శించాలని ఆదేశించారు. పైప్‌లైన్ పునరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్‌కు బన్నాల గీత ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking