*కోయిల్‌కొండ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు మృతి ఘటనపై తహశీల్దార్ వివరణ
మహబూబ్‌నగర్, అక్షిత ప్రతినిధి :
కోయిల్‌కొండ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం చోటుచేసుకున్న రైతు పసుల లావప్ప (50) మృతి ఘటనపై కోయిల్‌కొండ తహశీల్దార్ జి. దీపక్‌రావు వివరాలు వెల్లడించారు. కోయిల్‌కొండ మండలం పార్పల్లి గ్రామానికి చెందిన పసుల లావప్ప తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు తహశీల్దార్ తెలిపారు. ఉదయం సుమారు 6.30 గంటలకు ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిబంధనల ప్రకారం ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
భూ వివాదంపై కుమారుడి వాంగ్మూలం
మృతుడి కుమారుడు పసుల కురుమూర్తి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, పార్పల్లి శివారులోని సర్వే నంబర్ 211లోని వ్యవసాయ భూమికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తహశీల్దార్ తెలిపారు.దయ్యాలి లక్ష్మయ్య, పసుల చంద్రశేఖర్, పసుల విష్ణు, దయ్యాల రామకృష్ణ అనే వ్యక్తులు వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి హద్దు రాళ్లను తొలగించేందుకు ప్రయత్నించడం, పంటకు నష్టం కలిగించడం, తన తండ్రిపై దాడికి ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడినట్లు మృతుడి కుమారుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిపారు.

అదేవిధంగా, మృతుడు రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్‌లో కొందరి పేర్లు ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తహశీల్దార్ తెలిపారు. ఆ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు పోలీసులను కోరినట్లు వివరించారు. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.సర్వే నంబర్ 211కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు సర్వే నంబర్ 211కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించినట్లు తహశీల్దార్ తెలిపారు. 1954–55 ఖస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్ 211లో మొత్తం 18.39 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉండగా, టిప్పన్ ఆధారంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 17.39 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఈ భూమికి సంబంధించిన భౌతిక స్వాధీన అంశంపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉన్నట్లు పేర్కొన్నారు.సంబంధిత సర్వే నంబర్ లో పేర్కొన్న భూమి కి మృతుడికి ఎటువంటి సంబంధం లేదని తహశీల్దార్ వివరించారు.
మృతుడి కుటుంబ వివరాలు
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం మృతుడు పసుల లావప్ప పార్పల్లి గ్రామానికి చెందినవారని, ఆయనకు కనకమ్మ, మంజుల అనే ఇద్దరు భార్యలు మృతి చెందినట్లు తహశీల్దార్ తెలిపారు. వేణుగోపాల్, కుర్మయ్య, గంగాధర్ అనే ముగ్గురు కుమారులు, నాగేశ్వరమ్మ అనే కుమార్తె ఉన్నట్లు పేర్కొన్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని తహశీల్దార్ దీపక్‌రావు తెలిపారు. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, పోస్టుమార్టం నివేదిక, రెవెన్యూ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.