చెరువుగట్టు ఆలయ కోనేరులోకి మురుగు నీరు.. భక్తుల ఆగ్రహం

చెరువుగట్టు ఆలయ కోనేరులోకి మురుగు నీరు.. భక్తుల ఆగ్రహం

పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు.. 

పారిశుధ్యంపై అధికారుల నిర్లక్ష్యమంటూ ఆవేదన

నార్కట్ పల్లి అక్షిత ప్రతినిధి

తెలంగాణ శ్రీశైలంగా పేరొందిన చెరువుగట్టు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయ పుణ్యక్షేత్రంలో పారిశుధ్య నిర్వహణపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం ఎదుట ఉన్న పవిత్ర కోనేరులోకి డ్రైనేజీ మురుగు నీరు చేరుతున్న ఘటన భక్తులను ఆవేదనకు గురిచేసింది. అక్టోబర్ 2 సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనం కోసం చెరువుగట్టుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో కొందరు భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేస్తుండగా, డ్రైనేజీ పైపుల ద్వారా మురుగు నీరు కోనేరులోకి ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవిత్ర కోనేరులోకి మురుగు ఎలా?

దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే కోనేరులో మురుగు నీరు చేరడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల విశ్వాసానికి సంబంధించిన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్

పుణ్యక్షేత్రం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కోనేరులోకి మురుగు నీరు చేరకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. డ్రైనేజీ పైపుల ప్రవాహాన్ని వెంటనే మళ్లించడంతో పాటు, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కోనేరు పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking