ఆయకట్టుకు కృష్ణమ్మ పరుగులు

ఆయకట్టుకు కృష్ణమ్మ పరుగులు

కృష్ణమ్మకు పట్టు వస్త్రాలు

మంత్రి జగదీష్ రెడ్డి

నాగార్జునసాగర్, అక్షిత ప్రతినిధి : సాగర్ ఆయకట్టుకు కృష్ణమ్మ పరుగులు. జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా సాగునేరుగా పంట పొలాలకు చేరిపోయాయి. నాగార్జునసాగర్ జలాశయం పరిధిలోని ఎడమ కాలువ రైతుల వానాకాలం పంటల కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం కృష్ణమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేసి సాగునీరు విడుదల చేశారు. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎడమ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దశాబ్ద కాలం తర్వాత జూలై మాసంలో నీటి విడుదల చేయడం రెండవసారి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జూలై మాసంలో నీటి విడుదల చేయడం ఇదే ప్రథమమన్నారు. మొత్తం ఎడమ కాలువ పరిధిలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను సంబంధిత శాఖ అధికారులతో చర్చించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఎడమ కాలువ పరిధిలో నల్లగొండ జిల్లాలో 1,45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా కలుపుకొని 2 , 41,000 వేల ఎకరాలు సాగునీటి అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. కృష్ణా జలాల నీటి వాటాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుందన్నారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లాకు 18 టీఎంసీలు, సూర్యాపేట జిల్లాకు మరో 18 టీఎంసీలు, ఇక ఖమ్మం జిల్లాకు 29 టీఎంసీలు పంపకాలు జరిగాయని అన్నారు. కృష్ణా జలాల పంపకాల ద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో సాగు నీరు అందనుందన్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా వర్షపు నీరు వచ్చి చేరుతుందన్నారు.జూలై మాసంలో ఆయకట్టు ప్రాంత రైతులకు పంట పొలాలకు నీరు విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతాంగం అంతా సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తూ సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆయకట్టు ప్రాంతంలోని ఎడమకాలువ రైతాంగం ప్రతి నీటి బొట్టును అతి పొదుపుగా వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక యాసంగి వానాకాలం వరితోపాటు వరి పంటకు ప్రత్యామ్నాయంగా మేలు జరిగే పంటలను పండించి తెలంగాణ ప్రాంత విశిష్టతను ఇతర రాష్ట్రాలు దేశాలకు భిన్నంగా నిలపాలని రైతాంగాన్ని కోరారు. ఈ నీటి విడుదల పూర్తిగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రాంచందర్ నాయక్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ కర్ణ అనుష శరత్ రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, పెద్దవూర ఎంపీపీ అనురాధ సుందర్ రెడ్డి, సాగర్ తిరుమలగిరి ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీకాంతరావు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండెట్ ఇంజనీర్ ధర్మానాయక్ సాగర్ డ్యామ్ ఈ. ఈ. మల్లికార్జునరావు, డీడీ లు పరమేష్, సుదర్శన్ రావు, జేఈలు కృష్ణయ్య, జైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking