గురు పౌర్ణమి సందర్భంగా ఉరుమడ్ల బీసీ హాస్టల్‌లో ఘనంగా గురుపూజోత్సవం
– విద్యార్థులకు ప్రత్యేక హ్యాపీనెస్ కోర్స్
చిట్యాల అక్షిత ప్రతినిధి
గురు పౌర్ణమి సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఉరుమడ్ల బీసీ హాస్టల్‌లో ప్రత్యేక హ్యాపీనెస్ కోర్స్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు నిర్వహించారు.ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురూజీకి హాస్టల్ వార్డెన్ ప్రసాద్, విద్యార్థుల ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.హ్యాపీనెస్ కోర్స్‌లో భాగంగా విద్యార్థులకు యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, భస్త్రిక, ఉజ్జయి శ్వాస, వివిధ బ్రీతింగ్ టెక్నిక్స్, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ అందించారు.ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ, “గురువు జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జీవితం ఆనందమయం చేసే మహోన్నత వ్యక్తి. గురు కృపతో జీవితం ధన్యమవుతుంది. ధ్యానం, జ్ఞానం, సేవతో ప్రపంచాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుదాం. శ్వాసలో శక్తి, సేవలో సార్థకత, ధ్యానంలో విశ్వత్వం ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌తో కలిసి సంతోష నిర్మాణం చేద్దాం” అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.అలాగే “ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం” అనే సందేశంతో విద్యార్థులు సమాజ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. వేదాలను విభజించిన మహర్షి, పురాణాలను రచించిన ఆదికవి వేదవ్యాస మహర్షిని వ్యాస పౌర్ణిమ సందర్భంగా స్మరించుకుంటూ, సకల విద్యలను శిష్యులకు అందించిన గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రసాద్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్లు పల్లపు రాకేష్, నరేష్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
