ఆకర్షణీయం…అలంకారం…అదుర్స్

*ఆకట్టుకుంటున్న చారిత్రక భవనాలు, కార్యాలయాలు, జంక్షన్ల వజ్రోత్సవ అలంకరణ*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విధ్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను వినూత్నంగా విధ్యుత్ దీపాలతో అలంకరించారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్బంగా హైదరాబాద్ తోపాటు రాష్ట్రం మొత్తంలో పండగ వాతావరణం నెలకొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు తమ తమ కార్యాలయాలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా అలకరించుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లోని చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, కాచిగూడ, సికిందరాద్ రైల్వే స్టేషన్ లు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, అసెంబ్లీ, హై కోర్ట్ బీఆర్కేఆర్ భవనం, జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయ భవనాలపై చేసిన విద్యుద్దీపాల అలంకరణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా నగరంలోని అనేక మాల్స్ వినూత్న రీతిలో అలంకరించారు. ఈ విద్యుద్దీపాల అలంకరణ ఉన్న భవనాల వీడియోలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. వీటితోపాటు, సుప్రసిద్ధ రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి లాంటి అనేక దేవాలయాలను కూడా ఆకట్టుకునేలా అలంకరించారు. కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ విధిగా విధ్యుత్ దీపాలతో అలంకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking