ఒట్టేసి చెప్తున్న.. మూసీ ప్రక్షాళన చేస్తా

మూసీ ప్రక్షాళన

   నా జీవిత లక్ష్యం

వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బిసీ, డిండి ప్రాజెక్టుల పూర్తి 

రూ.13 వేల కోట్లతో రోడ్ల ప్రగతి 

పేదవాడి గుర్తింపే” రేషన్ కార్డు”

ఆత్మగౌరవ చిహ్నం ఇళ్లు 

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన చేసితీరుతామని, ఈ విషయాన్ని ఒట్టేసిచెబుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్ బిసిని, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్గొండలో పారేలా చేస్తామని అన్నారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రం మార్కెట్ యార్డు సమీపంలో నల్గొండ -దేవరకొండ రహదారిపై రాష్ట్రవ్యాప్తంగా 13006.27 కోట్ల రూపాయల వ్యయంతో 6092.37 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారుల విస్తరణ మరియు పటిష్టం చేసే హ్యం రోడ్ల శంకుస్థాపన పైలాన్ ను ఆవిష్కరించారు.

అంతేకాక 83 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశలో నల్గొండ పట్టణానికి తాగునీరు అందించే టి యఫ్ యు ఐ డి సి నిధుల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదవి చేపట్టిన నాడు రాష్ట్రంలో 69 వేల కోట్ల అప్పులు ఉండేవని , ఆ తర్వాత రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల ఆపులలోకి నెట్టి తెలంగాణను విధ్వంసం చేసిందని అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, ప్రతిపక్షాలు ఎప్పుడు అడిగినా శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మేనిఫెస్టోలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తాము పేదవాడి సంక్షేమం కోసమే కృషి చేస్తున్నామని, పేదవాడి గుర్తింపే” రేషన్ కార్డు” అని, పేదవాడి ఆత్మగౌరవమే “ఇందిరమ్మ ఇండ్లు” అని అన్నారు. రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయలతో మూడు కోట్ల 28 లక్షల మంది పేదలకు 6 కేజీల సన్న బియ్యం అందిస్తున్నామని, గత ప్రభుత్వం పేదోడి కలల సాకారమైన ఒక్క ఇల్లు ఇవ్వలేదని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామని, రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇచ్చామని, కాలేశ్వరం లేకున్నప్పటికీ అనేక కష్టాలు పడి రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచామన్నారు. తెలంగాణ గురుకులాల నుండి వందలాది మంది అంబేద్కర్ లను తయారు చేసే ఉద్దేశంతో ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు గుణాత్మక విద్యను అందించాలన్న లక్ష్యంతో పాఠశాలల పునరుద్ధరణ, సౌకర్యాల ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల ఆరుట్లలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతిభ దేశంలో మన రాష్ట్రాన్ని ముందు నిలిపేలా ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఉపకలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని, జనగణనలో కులగలను చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. 30 నెలల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. మూసీ నది ప్రక్షాలనే తన జీవిత లక్ష్యం అని, దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళన చేస్తామని, ప్రపంచంలో ఎవరైనా మూసి ప్రక్షాళన చూసేందుకు వచ్చేలా మూసి ప్రక్షాళనను చేపడతామని, తాను ఒట్టేసి చెబుతున్నానని ఎవరు అడ్డుపడిన మూసి ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్ బి సి, డిండి ప్రాజెక్టును వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి నల్గొండ జిల్లాలో కృష్ణానది జలాలను పారిస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 172 కోట్ల రూపాయల విలువచేసే బ్యాంకు లింకేజీ రుణాలను స్వయం సహాయక మహిళా సంఘాలకు అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 13000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే గాక, మరో 10 వేల కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వీటితోపాటు, జాతీయ రహదారులు, ఇతర రహదారులు అన్నింటి కలిపి 90 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పై దృష్టి సారించి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్ ఎల్ బి సి, డిండి, నక్కలగండి వంటి ప్రాజెక్టులను తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛలను తీర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల పైగా వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా సంక్షేమమే ఎజెండాగా తాము పని చేస్తామని తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో గతంలో ఎప్పుడు చేయనంతగా 13వేల కోట్ల రూపాయలతో రహదారులపై ఖర్చు చేసేందుకు శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక సందర్భం అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2023 నుండి ఇప్పటివరకు 79,886 కోట్ల రూపాయలను ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలలో జమ చేసామని తెలిపారు. ఈ సంవత్సరం 81 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని యాసంగిలో కొనుగోలు చేసి 19313 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. వరి పండించడంలోనూ వరి సేకరణలోను తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. అలాగే నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే వరి ధాన్యం సేకరణలో ముందు ఉందని అన్నారు .తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 కేజీల సన్న బియ్యం ఇస్తున్నామని, ఎస్ఎల్ బి సి ని పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని, అలాగే డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని, కృష్ణ నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామని, నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆధునికరిస్తామని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనివిధంగా 13000 కోట్ల రూపాయలతో రహదారుల పటిష్టం, విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం శుభసూచకమని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 75 వేల కోట్ల రూపాయలకు పైగా రహదారులకై ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆర్ అండ్ బి రహదారులతోపాటు, గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి, పంచాయతీ రాజ్ రోడ్లు చేపట్టనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు, బుల్లెట్ ట్రైన్ డిపిఆర్ తయారవుతున్నదని అన్నారు. నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ అని, అలాంటి గడ్డ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉన్న కార్పొరేషన్ నల్గొండ అని, నల్గొండ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు, షాది ఖానాకు 30 కోట్ల రూపాయలు, ఏఎమ్ఆర్పి లైనింగ్ పూర్తి చేసేందుకు మరో 500 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా ముఖ్య మంత్రికి విజ్ఞప్తి చేశారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హెచ్ ఎల్ సి, ఎల్ఎల్ సి లింకు కెనాల్ ను పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎస్ ఎల్ బి సి పూర్తి చేస్తే 80,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని, అయితే తమ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యను తీర్చాలని కోరారు. అలాగే డిండి ప్రాజెక్టులో ఉన్న భూసేకరణ సైతం పూర్తిచేయాలని, మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టిన నాలుగు ఎతివ్రతల పథకాలను కూడా పూర్తి చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,భువన గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కోటిరెడ్డి ,డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం ,నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యులు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, నేతి విద్యాసాగర్, మల్ రెడ్డి రంగారెడ్డి,
జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking