నత్తనడకన ‘సాగు’తున్న కల్వర్టు పనులు!
అసంపూర్తి పనులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలు
పట్టించుకోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు
కాజీపేట, అక్షిత ప్రతినిధి:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట నుంచి సోమిడికి వెళ్లే ప్రధాన రహదారిలో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని నెలలుగా పనులు అసంపూర్తిగా ఉండటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మూసివేయడంతో ఉనికిచర్ల సుబ్బయ్యపల్లె, టేకులగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కల్వర్టు పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వారు సైతం అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.
మిషన్ భగీరథ పైప్‌లైన్‌తో పనులకు అడ్డంకి
కల్వర్టు నిర్మాణ పనులకు మిషన్ భగీరథ మెయిన్ పైప్‌లైన్ అడ్డంకిగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. పైప్‌లైన్‌కు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాతే కల్వర్టు నిర్మాణాన్ని కొనసాగించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కల్వర్టు పనులు మరింత ఆలస్యమవుతున్నాయి.
త్వరగా పనులు పూర్తి చేయాలని డిమాండ్
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పైప్‌లైన్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కల్వర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి, రహదారిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని వాహనదారులు, స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.