తెలంగాణ ప్రగతి పరుగులు…

తెలంగాణ ప్రగతి పరుగులు

పేదింటి ఆడబిడ్డల్లో
‘కల్యాణ’ కాంతులు

మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 392 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల, 92 లక్షల, 45 వేల, 472 రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కల్యాణ కాంతులను వెదజెల్లుతున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఈ పథకాలను నిరుపేద ఆడబిడ్డలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 392 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.3 కోట్ల, 92 లక్షల, 45 వేల, 472 రూపాయల విలువైన చెక్కులను భాస్కర్ రావు శనివారం పంపిణీ చేశారు.

మిర్యాలగూడ పట్టణానికి చెందిన 83 మంది లబ్ధిదారులకు, మండలానికి చెందిన 81 మందికి, అడవిదేవులపల్లి మండలానికి చెందిన 48 మందికి, వేములపల్లి మండలానికి చెందిన 14 మందికి, మాడ్గులపల్లి మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు ఏఆర్సీ ఫంక్షన్ హాల్ లో, దామరచర్ల మండలానికి చెందిన 144 మంది లబ్ధిదారులకు అక్కడి రైతు వేదిక భవనంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని…దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని కేవలం టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో చెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్లు,ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking