
తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తిప్పన విజయసింహారెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే
తిప్పన విజయ సింహరెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. టిఆర్ఎస్ వ్యవస్థాపక నుండి టిఆర్ఎస్ లో ఉంటూ 2009వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తిప్పన విజయసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగుతారని ఆదేశించారు. విజయసింహారెడ్డి ప్రస్తుతం మిర్యాలగూడ జడ్పిటిసిగా కొనసాగుతున్నారు. 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి ఆయనను నియమించినట్లు తెలిసింది. మిర్యాలగూడ రాజకీయ ముఖ చిత్రంలో కార్పొరేషన్లు, చైర్మన్లు రావటం చాలా తక్కువ. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో విజయసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజినల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. మిర్యాలగూడకు ఇప్పుడు వరకు రాష్ట్రస్థాయి పదవులు రావడం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. గతంలోతెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఒకసారి ఏపీఐడిసి చైర్మన్ ఎండి ఖాసింకు, కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో కేంద్ర సిల్క్ బోర్డు మెంబర్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పదవి దక్కింది. తర్వాత ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ ఎన్నిక జరిగింది . ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే విజయ్ సింహరెడ్డికి రావటం మహదానందంగా ఉన్నది. సీనియర్ నాయకుడు, స్థితప్రజ్ఞుడు, ప్రజల్ని కలుపుకుపోయే గుణం ఉన్న మహా నేత ఎన్నిక కావడం మంచి పరిణామం. రైతు కుటుంబానికి చెందిన విజయసింహారెడ్డికి ఈ పదవి లభించడం రైతు సేవకు చేసుకొనే అవకాశం దొరికినట్లయిoది.విజయసింహరెడ్డి చైర్మన్ గా ఎన్నిక పట్ల మిర్యాలగూడ ఎం ఎల్ ఏ నలమోతు భాస్కరరావు హర్షం వ్యక్తం చేశారు.