చండూరులో వంద పడకల దవాఖాన

చండూరులో వంద పడకల దవాఖాన.. దండుమల్కాపూర్‌లో టాయ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం  కేటీఆర్‌ 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం సమీక్షాలో చర్చించిన అంశాలను మంత్రి కేటీఆర్‌ మీడియాకు వివరించారు. మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన, దండుమల్కాపూర్‌లో టాయ్‌ పార్క్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మునుగోడులో ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్‌ ద్వారానే రాబోయే ఆరేడు నెలల్లో రూ.100కోట్లతో రహదారుల విస్తరణ చేయబోతున్నాం. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.170కోట్లు వెచ్చించబోతున్నాం. మున్సిపల్‌శాఖ నేతృత్వంలో చండూరు మున్సిపాలిటీకి రూ.30కోట్లు, చౌటుప్పల్‌కు రూ.80కోట్లు కేటాయిస్తున్నాం. ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా రూ.25కోట్లతో రోడ్ల నిర్మాణానికి వెచ్చించబోతున్నం. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా రూ.8కోట్లతో 33/11 ఐదు సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నం’ అని ప్రకటించారు.

డివిజన్‌గా చండూరు.. చేనేతల కోసం హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్లు..
‘ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన మేరకు వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారో.. ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి నియోజకవర్గంలో ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఆసుపత్రి నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతో పాటు దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక పార్కును ఆనుకొని ఈ ప్రాంత 10వేల మంది పిల్లలకు ఉపాధి కల్పించేందుకు టాయ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. ఆటవస్తువులు తయారు చేసే కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే భూమిపూజ చేస్తాం. చండూరును రెవెన్యూ డివిజన్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

త్వరలోనే చండూరు డివిజన్‌ ఏర్పాటు చేస్తాం. నారాయణపూర్‌ మండలంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నాం. సేవాలాల్‌ బంజారా భవన్‌ను సంస్థాన్‌ నారాయణపూర్‌ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు రూ.కోటి మంజూరు చేసి.. మునుగోడులో అందుబాటులోకి తీసుకువస్తాం. కొత్తగా నాలుగు హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేస్తాం. భువనగిరి హెడ్‌ క్వార్టర్స్‌లో ఒకటి, నారాయణపూర్‌లో ఒకటి, గట్టుప్పల్‌లో ఒకటి, పెరటికల్‌లో ఒకటి చొప్పున ఏర్పాటు చేసి, అందుబాటులోకి తీసుకువస్తాం. నేతన్నలు యార్న్‌ సబ్సిడీని 40శాతం మొదట కట్టి తర్వాత తీసుకోవాల్సి వస్తుందని, కొంత జాప్యం జరుగుతుందని నేతన్నలు ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చారు. చేనేతలకు ఇచ్చిన మాట ప్రకారం.. దాన్ని సవరించి.. ఉత్తర్వులు ఇస్తాం’ అన్నారు.

నల్లగొండ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
‘ఎన్నికలకు ముందు ఓ మాట.. ఎన్నికల తర్వాత మరోమాట చెప్పకుండా.. నల్లగొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పినట్లుగా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముందుకు వెళ్తున్నాం. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల్లోపు కొత్తగా కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయబోతున్నాం. ఇరిగేషన్‌ విషయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటిని పూర్తి చేస్తాం. కొత్తగా చెక్‌డ్యామ్‌ మునుగోడులో ఏర్పాటు చేస్తాం. ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత సంపూర్ణంగా తీసుకుంటాం. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించిన ప్రజానీకానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా’నన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking