మా గుండెల్లో నల్గొండ ప్రగతి

రూ.1544కోట్లతో నల్లగొండ అభివృద్ధి : కేటీఆర్‌

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, మున్సిపల్‌, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో రూ.1544కోట్లు 12 నియోజకవర్గాల్లో ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. నల్లగొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి, సంక్షేమం’పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రులతో కలిసి కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకే శాసన సభ నియోజకవర్గానికి ఐదుగురు మంత్రులు, పెద్ద ఎత్తున అధికారులు అరుదైన, అసాధారణమైన సందర్భం. మునుగోడు ఎన్నికల ప్రచార సభలో గెలిపిస్తే మునుగోడు, నల్లగొండను గుండెల్లో పెట్టుకుంటానని సీఎం కేసీఆర్‌ చెప్పారు’ అని కేటీఆర్‌ తెలిపారు.

పనులు పూర్తి చేసే మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం..
‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 1952లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏకపక్షంగా గులాబీ జెండా ఎగుర వేసి నల్లగొండ జిల్లా గులాబీ జెండాను ఎలాగైతే గుండెల్లో పెట్టుకున్నదో.. నల్లగొండ జిల్లా బిడ్డలు ఎట్లయితే సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నరో.. అదేస్థాయిలో తప్పకుండా అండగా ఉంటామని చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు మంత్రులం నల్లగొండ జిల్లాకు వచ్చాం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అందరికీ పార్టీ కార్యకర్తలు పని చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితులు అధ్యయనం చేసే అవకాశం కలిగింది. మనుగోడు ప్రజలకు చేయదలుచుకున్న విజ్ఞప్తి ఒక్కటే.. గెలిపించింది కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మాత్రమే కాదు.. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చే బాధ్యత మా అందరిపై ఉంది. దీన్ని సమష్టి బాధ్యతగా తీసుకుంటాం. రాబోయే 10, 12 నెలల్లో సార్వత్రిక ఎన్నికలున్నయ్‌ కాబట్టి ఈలోగా పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నం. సాధ్యమైనంత వేగంగా పనులను పూర్తి చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం’ అన్నారు.

రాష్ట్రానికే విద్యుత్‌ వెలుగులు అందించే జిల్లాగా నల్లగొండ..
‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ లేదు. ఆ నాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటంటే ఇక్కటీ ఏర్పాటు చేయలేదు. కానీ, సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక మొత్తం తెలంగాణకే దిక్సూచిగా మూడు జిల్లాలను నిలుపుతూ.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే మెడికల్‌ కాలేజీలు ప్రారంభమై బ్రహ్మాండంగా నడుస్తున్నయ్‌. వాటికి సంబంధించి పర్మినెంట్‌ బిల్డింగ్‌లు పూర్తవుతున్నయ్‌. మొన్న సీఎం కేసీఆర్‌ దామెరచర్లకు వచ్చి ఒక మాట చెప్పారు.

మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్లలో కడుతున్న అల్ట్రామెగా పవర్‌ ప్లాయింట్‌ కేవలం తెలంగాణకు కాదు.. భవిష్యత్‌లో మరొక 50, 100 సంవత్సరాల పాటు అన్ని తరాలకు వ్యవసాయం ఎంత పెరిగినా, పరిశ్రామికీకరణ, పట్టణీకరణ ఎంత పెరిగినా.. పెరుగుతున్న అవసరాలకు తగ్గ విధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 4వేలమెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌, భవిష్యత్‌లో అవసరమైతే సోలార్‌ పవర్‌ తయారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రానికే విద్యుత్‌ వెలుగులు అందించే జిల్లాగా నల్లగొండ మారనున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గతంలో ధాన్యభాండాగారంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా కోస్తా జిల్లాలకు పేరుండేది. కానీ ఇప్పుడు వరిధాన్యం ఎక్కువ పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండోస్థానానికి
ఎగబాకింది. దాంట్లో అత్యధికంగా వరిపండిస్తున్న జిల్లా నల్లగొండ అని ఈ జిల్లా బిడ్డలు గర్వంగా చెప్పవచ్చు. సీఎం మద్దతు ప్రోత్సాహం వల్ల నల్లగొండ జిల్లా రైతులు అంతటి స్థాయిలో సాగు చేస్తున్నారు’ అన్నారు.

నల్లగొండ ప్రజలు గర్వంగా చెప్పొచ్చు..
‘తెలుగు రాష్ట్రాలు అబ్బురపడి చేస్తున్నాయి. ఒకనాడు ఒక పుణ్యక్షేత్రానికి రోజుకు 80వేలు, లక్ష మంది భక్తులు వస్తున్నారంటే ఆ ఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట తిరుమల బాలాజీకి ఉండేది. కానీ, మా యాదాద్రికి రోజుకు రూ.కోటి ఆదాయం వస్తుంది, 80వేలపైచీలుకు భక్తులు వస్తున్నరని తెలంగాణ బిడ్డలంతా గర్వంగా చెప్పొచ్చు. దాన్ని ఆ స్థాయిలో ఘనత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. దండుమల్కాపురంలో తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం. 542 ఎకరాల్లో 579 యూనిట్లకు స్థలం ఇచ్చి.. వేలాది మంది పిల్లలకు ఉపాధి కల్పించే బృహత్తర ఎని కార్యక్రమం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం నాయకత్వంలోనే. దాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.ఈ రోజు ప్రత్యేకంగా  మంత్రులు, పార్టీ నేతలు, సీఎం కేసీఆర్‌ తరఫున నల్లగొండ జిల్లాకుఇవ్వాలనుకుంటున్న విశ్వాసం, హామీ ఏంటంటే.. మీరు తీరుగనైతే పన్నెండింటింకి 12 స్థానాల్లో గెలిపించారో.. అదే పద్ధతుల్లో గుండెల్లో పెట్టుకునే బాధ్యత మాది. మాటలతోనే సరిపెట్టకుండా ఎన్నికల ఫలితం వచ్చిన నెలలోపే మళ్లీ అందరం ఇక్కడ ఉన్నం. సమీక్ష చేయడం, కార్యాచరణ చేయడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపై రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులు, డివిజన్‌, మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది’ అన్నారు.

రాబోయే ఆరేడు నెలల్లో..రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాబోయే ఆరేడు నెలల్లో రూ.402కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అన్ని నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వసతులు మెరుగుపడాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంత్రి దయాకర్‌రావు నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన తర్వాత రాబోయే ఆరేడు నెల్లల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.700కోట్లు పంచాయతీరాజ్‌శాఖ తరఫున ఖర్చు చేయబోతున్నాం. మున్సిపల్‌ శాఖ తరఫున 19 మున్సిపాలిటీల పరిధిలో రూ.334కోట్లు ఖర్చు చేయడంతో పాటు అదనంగా గ్రాంట్స్‌ ఇవ్వబోతున్నాం. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి ఆధ్వర్యంలో వారందరి బాగు కోసం రూ.100కోట్ల తండాల్లో రోడ్ల బాగు కోసం ఖర్చు చేయనున్నాం. జిల్లా ముద్దుబిడ్డ, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, మున్సిపల్‌, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో రూ.1544కోట్లు 12 నియోజకవర్గాల్లో ఖర్చు చేయబోతున్నం. నల్లగొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని విజ్ఞప్తి చేస్తున్నం’ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking