అస్మిత ఖేలో ఇండియా పోటీల్లో కరీంనగర్ జట్టు అగ్రస్థానం
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా అండర్-16 బాలికల ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీలు మూడో రోజు జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. బుధవారం గ్రౌండ్ నెంబర్-1లో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జిల్లా జట్టు, కరీంనగర్ జిల్లా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు 0-1 గోల్స్ తేడాతో స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జట్టుపై విజయం సాధించి అస్మిత ఖేలో ఇండియా అండర్-16 బాలికల లీగ్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్‌ను కైవసం చేసుకుంది.ఈ పోటీల్లో మొదటి స్థానం కరీంనగర్ జిల్లా జట్టు సాధించగా, రెండో స్థానం స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జిల్లా జట్టు దక్కించుకుంది. మూడో స్థానం సంయుక్త విజేతలుగా అదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా జట్లు నిలిచాయి.విజేత జట్లకు మంత్రి వివేక్ వెంకటస్వామి, నిర్వాహకుల చేతులమీదుగా ట్రోఫీలు, పతకాలు అందజేసి అభినందించారు.