ఆహార భద్రత.. అగమ్యగోచరం!
నిద్రావస్థలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
అపరిశుభ్రత, కుళ్లిన ఆహారం.. పట్టించుకోని యంత్రాంగం
కార్యాలయమూ లేదు.. అధికారి ఫోన్ ఎత్తరు!
యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో
కాదేదీ మోసానికి అనర్హం’ అన్నట్లుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆహార వ్యాపారులు బరితెగిస్తున్నారు. నాసిరకం వస్తువులు, కల్తీ ఆహారం, గడువు ముగిసిన సరుకులను విక్రయిస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హోటళ్లు, డాబాలు, బేకరీలపై నిఘా ఉంచి నియంత్రిం చాల్సిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిద్రావ స్థలో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడ ప్పుడు మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపు కుంటున్నారే తప్ప, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసు కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.
పుట్టగొడుగుల్లా హోటళ్లు… నాణ్యత శూన్యం..
జిల్లాలోని 17మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. ముఖ్యంగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదా రిపై ఉన్న డాబాలు, రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆహారంలో హానికరమైన రంగులు, రసాయనాలు కలుపుతూ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో గడువు ముగిసిన సరుకులు బయటపడడం కలకలం రేపింది. యాదగిరిగుట్టలో మున్సిపల్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిన చికెన్, నాణ్యత లేని బిర్యానీ దినుసులు వెలుగు చూడడం జిల్లాలోని ఆహార నాణ్యతకు నిదర్శ నంగా నిలుస్తోంది.
మామూళ్ల మత్తులో పర్యవేక్షణ గాలికి..
జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. వంట గదుల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నా, కుళ్లిపోయిన కూరగా యలు, నాణ్యత లేని నూనెలను వాడుతున్నా అధికా రులు కన్నెత్తి చూడడం లేదు. కొందరు మిశ్రమ నూనెలను, నిషేధిత సింథటిక్ రంగులను వాడుతూ ప్రజలకు ‘స్లో పాయిజన్’ వడ్డిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడుతున్న నూనెలు నల్లగా మారినా వాటినే పదే పదే ఉపయోగిస్తు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిరంతరం దాడులు చేయకపోవడంతో వ్యాపారులు యథేచ్ఛగా సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతు న్నారు. అధికారుల మామూళ్ల మత్తు వల్లే ఈ అక్రమ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగు తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.