ఫైనల్‌కు కరీంనగర్, రంగారెడ్డి జట్లు దూసుకెళ్తూ సత్తా చాటిన బాలికలు
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక టాగూర్ స్టేడియంలో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా అండర్-16 బాలికల ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో రెండో రోజు ఉత్కంఠభరిత సెమీఫైనల్ మ్యాచ్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
గ్రౌండ్ నంబర్-1లో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు, కరీంనగర్ జట్టు మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 3-1 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించి ఘనంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రౌండ్ నంబర్-2లో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టు, స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జట్ల మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ రేపింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం నిర్వహించిన పెనాల్టీ షూట్-అవుట్‌లో 5-4 గోల్స్ తేడాతో స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జట్లు తలపడనున్నాయి.