త్వరలో యాసంగి రైతుబంధు
★ ప్రపంచంలో రైతుబంధు, రైతుబీమా
రెండూ ఇస్తున్న జాగా తెలంగాణే
★ కేసీఆర్ బతికున్నంతవరకు ఆగవు
★ 7 వేల కేంద్రాలతో ధాన్యం కొనేది మనమే:
ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఈ దేశంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం.. భూప్రపంచంలో రైతుబీమా ఇచ్చేదేశం ఇంకొకటి లేదు. రైతుబంధు, రైతుబీమా రెండూ అందిస్తున్న ఒకే ఒక్క జాగా తెలంగాణ మాత్రమే.
యాసంగి రైతుబంధు నిధులను త్వరలో విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 10న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉన్నదని, అందులో నిర్ణయించి ఐదు పది రోజుల్లో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం జగిత్యాలలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దీంతో సభకు హాజరైన ప్రజలు పెద్దఎత్తున హర్షధ్వానాలు తెలిపారు. త్వరలో రైతుబంధు నిధులు అకౌంట్లో చేర గానే ‘టింగ్.. టింగ్.. టింగ్’ అని సెల్ఫోన్ మోగుతుందని కేసీఆర్ చెప్పారు. ‘ముఖ్యమంత్రి ఫోన్ వస్తది, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఫోన్ వస్తది, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ వస్తది. మీ అకౌంట్లో ఎంతడబ్బు పడ్డదో చెప్తారు.” అని పేర్కొన్నారు. ‘రై తుబంధు, రైతుబీమా అనాలోచితంగా, ఆగమాగం ఇచ్చింది కాదు. చితికిపోయి, ఛిద్రమై పోయి, అగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరి పోవాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిపడాలని తీసుకున్న ‘నిర్ణయం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం, భూ ప్రపంచంలో రైతు బీమా ఇచ్చే దేశం ఇంకొకటి లేదని చెప్పిన ముఖ్యమంత్రి.. రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క జాగా తెలంగాణ మాత్ర మేనని స్పష్టంచేశారు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని మరో సారి స్పష్టంచేశారు. 10 ఎకరాలకు మించి రైతు బంధు ఎందుకు ఇస్తున్నరు? దానికి పరి మితి పెట్టవచ్చు కదా? అని కొంతమంది రక రకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవం ఏమి టంటే.. మన రాష్ట్ర రైతుల్లో 93.5 శాతం మంది 5 ఎకరాల లోపువాళ్లే. 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్నవాళ్లు 5 నుంచి 6 శాతమే. 10 ఎకరాలకు పైన ఉన్నోళ్లు ఒక్క శాతమే. 25 ఎకరాలపైన ఉన్న రైతులు కేవలం 0.5 శాతమే. ఈ వాస్తవాలు చాలా మందికి తెలవదు కాబట్టే ఏదేదో అనుకుంటరు’ అని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమాతోనే రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవని సీఎం కేసీఆర్ చెప్పారు.
పంట అమ్ముకునే రంది లేకుండా చేసినం..
‘దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రైతుల ధాన్యం కొనుగోలు చేయదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 7 వేల కొనుగోలు కేంద్రాలు పెట్టినం. పండిన పంటను అమ్ముకోవాలనే రంది రైతుకు లేకుండా చేసినం. అమ్మిన పంటకు ఐదు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా బ్రహ్మాండంగా ధాన్యం కొను గోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఇంటిముందుకు గంగిరెద్దులోళ్లు వస్తే చాటెడు బియ్యం, చాటెడు ధాన్యం పెట్టే పరిస్థితి ప్రతి ఇంటా ఉండాలని అన్నారు. ‘నా చిన్నత నంలో సిద్దిపేటకు పోతే షావుకార్లు కూడా మా దగ్గర కరువు ఉన్నదండీ అని చెప్పేవాళ్లు. కరువు అంటే రైతులకే కదా? అని ప్రశ్నిస్తే… పంటలు పండి రైతులకు డబ్బులొస్తేనే కదా మాకు గిరాకీ వస్తది అని చెప్పేవాళ్లు. ఇలా ఇంటర్ లింక్ ఉంటుంది. దీనినే స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటరు. రైతు ప్రయోజకర పథకాలతో ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక పునాది పరిపుష్టమైంది’ అని పేర్కొన్నారు.