పట్టుదలతో చదివితేనే సివిల్స్ సాధ్యం

పట్టుదలతో చదివితేనే సివిల్స్ సాధ్యం 

సిఎస్. సోమేశ్ కుమార్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలోని విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకాంక్షించారు. తమ లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా నిరుత్సాహపడొద్దని, మరింత కఠిన దీక్ష, నిరంతర అధ్యయనంతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని అన్నారు. ఉస్మానియా విశ్యవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీ ని నేడు సాయంత్రం సి.ఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రో. రవీందర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో. లింబాద్రి, సీనియర్ ఐఏఎస్ అధికారులు బీ.వెంకటేశం, నవీన్ మిట్టల్, వాకాటి కరుణ, టీ.ఎస్.పి.ఎస్.సి. మాజీ చైర్మన్ ప్రో. గంటా చక్రపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సివిల్ సర్వీస్ సాధనలో తానూ రెండు సార్లు విఫలం చెందానని, అయితే ఏమాత్రం నిరుత్సాహపడకుండా పట్టుదలతో చేసిన కృషి ఫలితమే మంచి రాంక్ తో సివిల్స్ సాధించానని వెల్లడించారు. సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే వారికి ముఖ్యంగా ఎస్.సి. ఎస్.టి., బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన సివిల్ సర్వీసు అకాడమీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇదే మాదిరి కోచింగ్ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో ప్రారంభించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో, గ్రూప్ వన్ నుండి గ్రూప్ ఫోర్ వరకు దాదాపు ఒక లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతున్నాయని , ఈ అవకాశాన్ని యువత పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం దాదాపు 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే లభిస్తాయని, ఈ విధానం గత ప్రభుత్వాలలో లేదని వివరించారు. ఇప్పటికే, గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష పూర్తయిందని, ఈ పరీక్ష విషయంలో కోర్టు ఉన్న కేసు నేడు తొలగి పోయినందున, మరి కొద్దీ రోజుల్లో మెయిన్స్ కు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముందని అన్నారు. మొట్ట మొదటి సారిగా దాదాపు 500 పోస్టులు గ్రూప్ వన్ లో ఉన్నాయని, వీటికి 25 వేలమంది అభ్యర్థులు మెయిన్స్ కు హాజరయ్యే అవకాశముందని చెప్పారు. ఉస్మానియాలో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీ కి రాష్ట్ర ప్రభుత్వ ఎస్.సి., బీసీ, ఎస్.టి, మైనారిటీ శాఖల నుండి తగు నిధులు అందించేలా చర్యలు తీసుకోగలని హామీనిచ్చారు.
ఉస్మానియావిశ్వ విద్యాలయం వీసీ. ప్రొ. రవీందర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఉస్మానియాకు 22వ స్థానం ఉందని తెలిపారు. యూనివర్శిటీ స్థాయి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు కేవలం కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉన్నతాస్థాయి ఉద్యోగాలను సాధించడానికి …. సివిల్ సర్వీసెస్ అకాడమీ స్థాపించాలనే ఆలోచన వచ్చిందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఈఓలుగా, యజమానులుగా ఉస్మానియా విద్యార్థులు ఉన్నారని, సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లోను రాణించం పెద్ద సమస్య కాదని అన్నారు. వారం వారం ఓయూ విద్యార్థులను చైతన్య పరిచేందుకు, పరీక్షల్లో మెళకువలు నేర్పేందుకు ఒక ఆల్ ఇండియా సర్వీసు అధికారి వచ్చి పాఠాలు చేప్తారని కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉద్యోగాల కోసం పోటీపడి చదివాలని పిలుపునిచ్చారు.
వృధా అయిన సమయం తిరిగి రాదని, కష్టపడి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విద్యార్థులకు సూచించారు.
ఉస్మానియా ఈ-వన్ హాస్టల్ లో ఉంటూ తాను ఐఏఎస్ సాధించానని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థుల మేధస్సు అత్యుత్తమమని… ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. విద్యార్థులు గొప్పగా ఆలోచించాలని… కలలనను సాకారం చెసుకునేందుకు కష్టపడాలని సూచించారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులే ఉచితంగా దాదాపు 130 కోచింగ్ సెంటర్లను నడుపుతున్నారని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు వస్తున్నాయని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టీ.పి.పి.ఎస్. సి మాజీ చైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి అన్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫసర్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ బానోత్ రెడ్యానాయక్, ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. గణేష్ సహా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు, వివిధ విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు, భోదన, భోదనేతర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking