పేదల పెన్నిధి…రామారావు ఇకలేరు
ప్రజల హృదయాల్లో
రామారావు పదిలం
ఆమనగల్లు మాజీ సర్పంచ్
పేరాల రామారావు కన్నుమూత
నేడు లక్ష్మీదేవిగూడెంలో అంత్యక్రియలు
అక్షిత ప్రతినిధి, వేములపల్లి :
పేదల పెన్నిధి… పేరాల రామారావు కన్నుమూశారు. పేదల కష్టాలు, కడగండ్లు తీర్చుతూ… వారి పాలిట దేవుడుగా కీర్తి నార్జించాడు. ఆమనగల్లులో తాగునీటికి అల్లంత దూరం వెళ్లి రాత్రిoబవల్లు అల్లాడే ప్రజల నీటి గోసను తీర్చేందుకు ఓవర్ హెడ్ టాంక్ ల నిర్మాణం చేపట్టడం, మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే ఆమనగల్లును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు విశిష్ఠ సేవలందించిండ్రు. భౌతికంగా
రామారావు కన్ను మూసినప్పటికి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పదిల పరచుకుండ్రు.

వేములపల్లి మండలంలోని ఉమ్మడి ఆమనగల్లు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, ఎల్20 లిప్టు చైర్మన్ లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన పేరాల రామారావు గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందడం జరిగింది. మంచికి మారుపేరుగా నిలిచి అందరితో ఆప్యాయంగా మెలిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలబడి గ్రామ పంచాయతీలోని నిరుపేద కుటుంబాలకు అండదండలు అందించిన రామారావు కన్నుమూశారనే వార్తతో అమనగల్లు, లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*అమనగల్లు తొలి సర్పంచ్
పేరాల రామారావు*
అమనగల్లు గ్రామానికి చెందిన దేశ్ ముఖ్ గడ్డం లక్ష్మారెడ్డి ఆశీస్సులతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రామారావు అనంతరం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి అఖండ విజయం సాధించి మొట్టమొదటి గ్రామ పంచాయతీ సర్పంచుగా ఖ్యాతి పొందారు.

అలనాటి సీపిఎం పార్టీ కురువృద్ధుడు సీపీఎం పార్టీ శాసనసభ పక్ష నేత నకిరేకల్ ఎమ్మెల్యే స్వర్గీయ నర్రా రాఘవరెడ్డి సహాయ సహకారాలతో అమనగల్లు గ్రామ పంచాయతీ అభివృద్ధికి తనవంతు కృషి చేసి ప్రజల హృదయాల్లో చెదరని తనదైన ముద్ర వేసుకుండ్రు. దేశ్ ముఖ్ గడ్డం లక్ష్మారెడ్డి సహాయ సహకారాలతో ఆయన ప్రియ శిష్యుడిగా గత ఏభైఏళ్లుగా ఉమ్మడి ఆమనగల్లు గ్రామపంచాయతీకి తనదైన రీతిలో సేవలు అందించారు. అమనగల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవిగూడెం, రావువారిగూడెం, చలిచీమలపాలెం అవాస ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ ,మంచినీరు,ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణాలు ఆయన కాలంలోనే జరిగాయి. ప్రస్తుతం పేరాల రామారావు ఎల్ 20లిప్టు చైర్మన్ గా కొనసాగుతున్నారు.
రామారావు మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి*
ఉమ్మడి అమనగల్లు గ్రామ పంచాయతీ మొట్టమొదటి సర్పంచ్, ప్రస్తుత ఎల్20 లిప్టు ఛైర్మన్ పేరాల రామారావు మృతి పట్ల శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎన్ బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నలమోతు సిద్దార్థ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు ఎండి మోసిన్ అలీ, జెడ్పిటిసీ ఇరుగు మంగమ్మవెంకటయ్య, సల్కునూరు పిఎసిఎస్ చైర్మన్ గడ్డం స్ఫురధర్ రెడ్డి, వేములపల్లి, మాడ్గులపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, చిర్ర మల్లయ్య యాదవ్, షేక్ మౌలాలి, వెంకటేష్ లతో పాటు పలువురు నాయకులు మృతుని కుమారుడు అమనగల్లు మాజీ సర్పంచ్, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పేరాల కృపాకర్ రావుకు ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరాల కృపాకర్ రావు అదే స్థాయిలో పేదల అభ్యున్నతికి, ఆమనగల్లు ప్రగతికి విశిష్ట సేవలందిస్తుండ్రు. ఈనెల 17న శనివారం ఉదయం 11 గంటలకు లక్ష్మిదేవిగూడెంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.